15 April, 2026 | 2:50 AM

అర్ధరాత్రి పోస్ట్ ఆఫీస్‌లో దొంగల బీభత్సం

15-04-2026 12:02 AM
  1. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో పోస్ట్ ఆఫీస్
  2. అడ్డుకున్న వాచ్మ్పె కర్రతో దాడి, పరిస్థితి విషమం
  3. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటు చేసుకున్న ఘటన

బాన్సువాడ,ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): ఆ పోస్ట్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉంది... అక్కడ ఏం జరిగినా పెట్రోలింగ్ లో ఉండే పోలీసులు, ఆన్ డ్యూటీ లో ఉండే పోలీసులకు ఇట్టే తెలుస్తుంది కానీ ఆలా జరగలేదు దొంగలు ధైర్యంగా పోస్ట్ ఆఫీస్ లోకి చొరబడ్డారు వాచ్ మెన్ ను తీవ్రంగా కొట్టారు. చో రీ చేసి వెళ్లిపోయారు కాదు కాదు పోలీసుల కళ్ళు గప్పి అక్కడి నుంచి పారిపోయారు.ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్ వాడలో చోటు చేసుకుంది.

చోరి సొత్తు ఎక్కువ కాకున్నా పోలీస్ స్టేషన్ ఎదుటే చోరికి పాల్పడి వాచ్ మెన్ ను తీవ్రంగా కొట్టిన దొంగల ధైర్యం పట్ల పుర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాన్సువాడ పోస్టాఫీసులో సోమవారం అర్థ రాత్రి సమయంలో దొంగలు చొరబడ్డారు. ఫించన్ సొమ్ము, ఖాతాదారులు దాచికున్న సొమ్ము ఉంటుందని చోరికి యత్నించారు. చోరీకి యత్నించిన దొంగలను వాచ్మెన్ సాయిలు అడ్డుకోవడంతో దుండగులు ఆయన తలపై కర్రతో బలంగా బాదారు.

తల పగిలిపోయి తీవ్ర రక్తస్రావం అయ్యింది. తలకు 52 కుట్లు పడ్డాయి. సాయిలు దగ్గర ఉన్న రూ. 1000 నగదు, మొబైల్ ఫోన్ లాక్కుని దొంగలు పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో సాయిలు పరిస్థితి విషమించడంతో, ఆయనను వెంటనే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నరూ.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. పోస్టాఫీసు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో దొంగలను పట్టుకొంటామని సి ఐ శ్రీధర్ తెలిపారు.వరుస చోరీలతో బాన్సువాడ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి గస్తీ పెంచాలని కోరుతున్నారు.