పట్టుదలతో చదివితే రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు
ఘట్‌కేసర్,(విజయక్రాంతి) : పట్టుదల, క్రమశిక్షణతో చదివితే రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధ్యమవుతుందని ఘట్ కేసర్ ప్రెస్ క్లబ్(Ghatkesar Press Club) అధ్యక్షుడు లింగాల భూపాల్ అన్నారు. ఘట్‌కేసర్ పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని యామిని 10వ తరగతి ఫలితాలలో విశిష్ట ప్రతిభ కనబరిచి 576 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలవడంతో పాటు జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. ఈ సందర్భంగా ఘట్‌కేసర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యామినిను ఘనంగా సన్మానించారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లింగాల భూపాల్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యామినికు రూ. 3,100 నగదు బహుమానం అందజేయడంతో పాటు ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు, భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుమతిగా అందించారు. ఆమె కృషి, పట్టుదల అభినందనీయం అని కొనియాడుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి యామినిను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించడం సాధ్యమే అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా పట్టుదలతో శ్రమిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచగలరని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మండల విద్యాధికారి రాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, విద్యార్థిని తల్లిదండ్రులు, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కే. యాదగిరి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎస్. నర్సింగ్ రావు, కోశాధికారి యల్. రాజు, సలహాదారులు ఎఫ్. రామకృష్ణ, వి. గోవింద్, సభ్యులు పాల్గొన్నారు.






