కన్న కొడుకును హతమార్చిన తండ్రి
కల్లూరులో దారుణం
కల్లూరు, జూలై 04(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కల్లూరులో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది.కన్న కొడుకును తండ్రే దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.స్థానికుల వివరాల ప్రకారం,పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన కొత్తపల్లి సీతారాములు (ఆటో డ్రైవర్) శుక్రవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో మద్యం మత్తులో తన ఒక్కగానొక్క కుమారుడు కొత్తపల్లి కిరణ్ కుమార్ (30)ను సమీపంలోని బెల్ట్ షాపుకు తీసుకెళ్లి మద్యం తాగించాడు.అనంతరం ఇంటికి తీసుకువచ్చిన తర్వాత తీవ్ర ఆగ్రహంతో కుమారుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ దాడిలో కిరణ్ కుమార్ తల వెనుక భాగంలో బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.కుమారుడు మృతిచెందినట్లు నిర్ధారించుకున్న సీతారాములు తన ఆటోలో అక్కడి నుండి పరారయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.నిందితుడిని పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.మృతుడికి భార్యతో పాటు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు.ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






