6 May, 2026 | 1:50 PM

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బోగస్ పత్రం— బక్వాస్ ముచ్చట

06-05-2026 01:00 PM
  1. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అనేది బోగస్ పత్రం, చిత్తుకాగితం 
  2. కాంగ్రెస్ పెట్టింది రైతు మేళా కాదు.. దగా మేళా
  3. రాహుల్, రేవంత్ ఫోటోలు.. పోలీస్ స్టేషన్లలో పెట్టాలి
  4. రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నయవంచన

హైదరాబాద్: వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు(Rythu Sangrama Sadassu) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రైతుల ఓట్ల కోసం నాలుగేళ్ల క్రితం కాంగ్రెస్ నేతలు కొంగజపం చేశారని మండిపడ్డారు. వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ.. వరంగల్ లో పోరాటాల విల్లు ఎక్కుపెడితే.. ద్రోహుల గుండె ఝల్లుమంటుందని కేటీఆర పేర్కొన్నారు. రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నయవంచనకు పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు జరిగిన మోసాలు గుర్తుచేసేందుకు రైతు సంగ్రామ సదస్సు పెట్టుకున్నామని తెలిపారు. నాలుగేళ్ల కిందట ఇదే వరంగల్ కు కాంగ్రెస్ పెద్దలు వచ్చారని కేటీఆర్ సూచించారు.

నాలుగేళ్ల కిందట కాంగ్రెస్ నేతలు వరంగల్ రైతు డిక్లరేషన్(Warangal Farmers Declaration) ప్రకటించారని చెప్పారు. 60 ఏళ్ల పాటు రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. రైతు డిక్లరేషన్ లో రైతులకు కాంగ్రెస్ నేతలు 34 హామీలు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ హామీలను(Congress Six Guarantees) నమ్మి రైతులు ఓటు వేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్నారు.. 900 రోజులు అయినా నెరవేర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. రైతు డిక్లరేషన్ లో 34 హామీలు ఇస్తే.. ఒక్కటీ అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అనేది బోగస్ పత్రం, చిత్తుకాగితం అన్నారు.

ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ నేతలు అడ్రస్ లేకుండా పోయారని కేటీఆర్ ఎద్దేవాచేశారు. రైతు డిక్లరేషన్ ఇచ్చి నాలుగేయ్యింది.. ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అయిందన్నారు. ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయినా హామీలు నెరవేర్చట్లేదు. మేం రైతు సంగ్రామసభ పెడితే.. కాంగ్రెస్ నేతలు రైతుమేళా అని పెట్టారని చురకలంటించారు. కాంగ్రెస్ పెట్టింది రైతుమేళా కాదు.. దగామేళా అన్నారు. రైతు డిక్లరేషన్, రాహుల్ గాంధీ(Rahul Gandhi), రేవంత్ రెడ్డి ఫొటోలను పోలీస్ స్టేషన్లలో  అంటించాలని కేటీఆర్ పేర్కొన్నారు. వాళ్ల ఫొటోలు పోలీస్ స్టేషన్లలో పెట్టి.. దొంగలున్నారు జాగ్రత్త అని రాయాలని కేటీఆర్ తెలిపారు.