పోడు భూములపై ఉద్రిక్తత
భారీ పోలీసు బందోబస్తుతో అటవీశాఖ ట్రెంచ్ తవ్వకాలు
ఆందోళనలో పోడు రైతులు
ఆసిఫాబాద్(విజయక్రాంతి): కెరమెరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దేవుడుపల్లి బీట్‌లో, సూర్ధపూర్ గ్రామ శివారులో ఉన్న సుమారు 150 హెక్టార్ల భూమిని అటవీశాఖ అధికారులు(Forest Department) స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములు పోడు సాగు చేస్తున్న రైతుల ఆధీనంలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల అటవీశాఖ అధికారులు ట్రెంచ్ తవ్వకాలకు వెళ్లగా, స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ముందస్తు చర్యలో భాగంగా వందమందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, జేసీబీల సహాయంతో అటవీశాఖ అధికారులు కందకాల తవ్వకాలు చేపట్టారు.రైతులు భూముల వద్దకు చేరకుండా ముందస్తుగానే పోలీసులు గ్రామ పరిసరాల్లో, వ్యవసాయ భూముల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. తమ పోడు భూములను రక్షించాలని, తమకు న్యాయం చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.






