4 July, 2026 | 1:14 PM

వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత

04-07-2026 12:08 PM

భద్రకాళి ఆలయం శుద్ధికి బీజేపీ యత్నం..

హైదరాబాద్: వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం(Warangal Bhadrakali Temple) వద్ద శనివారం నాడు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆలయం శుద్ధి కోసం వచ్చిన బీజేపీ(Bharatiya Janata Party) కార్యకర్తలను అడ్డుకోవడంతో ఆందోళన నెలకొంది. బీజేపీ కార్యకర్తలను ఆలయం లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. భద్రకాళి ఆలయం వద్ద పోలీసులు-బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల సవాల్ ప్రతి సవాళ్లతో భద్రకాళి ఆలయం మైల పడిందని బీజేపీ ఆధ్వర్యంలో ఆలయ శుద్ధికి యత్నించారు. ఆలయం వద్ద పెద్దఎత్తున పోలీసులు మొహరించారు. బీజేపీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు మట్టేవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రావడంతో ఆలయం అపవిత్రమైందంటూ బీజేపీ ఆరోపించింది. ఆలయం అపవిత్రమైనదని శుద్ధి చేస్తామంటూ భారీగా బీజేపీ నేతలు ఆలయానికి చేరుకున్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు నిన్న తడిబట్టలతో ఆలయానికి వెళ్లిన విషయం తెలిసిందే. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ 'KUDA' ప్లాట్ల వేలంపై ఆరోపణలు చేస్తూ ఇరు పార్టీల నేతలు ఆలయానికి వెళ్లారు. వరంగల్ 'కూడా' భూములపై రాజకీయ వాతావరణం నెలకొంది. మాజీ ఛైర్మన్ తడి బట్టలతో భద్రకాళి ఆలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు మాజీ ఛైర్మన్ ను అదుపులోకి తీసుకున్నారు.