3 March, 2026 | 6:02 AM

చేజారిపోతున్నాయ్

03-03-2026 12:00 AM
  1. క్యాచ్‌లు వదిలేస్తున్న ఫీల్డర్లు 
  2. మెగా టోర్నీలో భారత్ చెత్త ఫీల్డింగ్ 
  3. మనకంటే మెరుగ్గా జింబాబ్వే 
  4. ఇలాగైతే టైటిల్ గెలవడం కష్టమే

* క్రికెట్‌లో ఏ ఒక్క విభాగంలోనో అదరగొడితే విజయాలు రావు.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ దుమ్మురేపాల్సిందే. మరీ ముఖ్యంగా మ్యాచ్‌లు గెలిపించేవి క్యాచ్‌లే.. 2024 ప్రపంచకప్ ఫైనలే దీనికి ఉదాహరణ... సూర్యకుమార్ అందుకున్నది క్యాచ్ కాదు వరల్డ్ కప్ అన్నది అందరికీ తెలుసు.

అందుకే క్యాచ్‌లు జారివిడిస్తే మ్యాచ్ చేజారినట్టే. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మాత్రం ఫీల్డింగ్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. కీలకమైన సెమీఫైనల్‌కు ముందు ఫీల్డింగ్ మెరుగవవ్వకుంటే మాత్రం కష్టమే

ముంబై, మార్చి 2: టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్‌కు చేరింది. వెస్టిండీస్‌ను ఓడించి ఇప్పుడు ఇంగ్లాండ్‌తో నాకౌట్ పోరు కు రెడీ అవుతోంది. సంజూ శాంసన్ ఫామ్ లోకి రావడం జట్టుకు పెద్ద అడ్వాంటేజ్. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా ఈ మెగాటోర్నీలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబ రిచిందా అంటే అవును అని సమాధానం చెప్పలేం.

ఎందుకంటే టీమిండియా సెమీస్ కు చేరినా ఇంకా కొన్ని బలహీనతలు వెంటాడుతున్నాయి. బ్యాటింగ్‌లో నిలకడలేమి, బౌల ర్లు అనుకున్న స్థాయిలో రాణించకపోవడం, ముఖ్యంగా ఫీల్డింగ్ మాత్రం దారుణంగా ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే చెత్తగా ఉంది. వెస్టిండీస్‌తో మ్యాచ్ లో ఇది స్పష్టంగా కనిపించింది. పలు క్యాచ్‌లు వదిలేయడం విండీస్ భారీస్కోరు చేసేందుకు దోహదపడింది. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ చివరి వరకూ క్రీజులో నిలదొక్కుకున్నాడు కాబట్టి సరిపోయింది.

ఒకవేళ విండీస్‌పై భారత్ ఓడిపోయి ఉంటే ఖచ్చితంగా అది ఫీల్డింగ్ తప్పిదా లే కారణంగా చెప్పేవారు. ఎందుకంటే నాలు గు కీలక క్యాచ్‌లు వదిలేశారు. ఈ మ్యాచ్ మాత్రమే కాదు ఓవరాల్‌గా ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫీల్డింగ్ అత్యంత పేలవంగా ఉంది. క్యాచ్‌లు అందుకునే అంశంలో సూపర్ 8 స్టేజ్‌కు సంబంధించి చివరి స్థానం లో ఉంది. ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉండగా.. జింబాబ్వే రెండో స్థానంలోనూ, విండీస్, న్యూజిలాండ్ తర్వాతి స్థానాల్లోనూ కొనసాగుతున్నాయి.

మనకంటే పాకిస్థాన్, సౌతాఫ్రికా, శ్రీలంక కూడా మెరుగ్గానే క్యాచ్‌లు అందుకుంటున్నాయంటే భారత్ ఫీల్డింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో ఇప్పటిదాకా భారత జట్టు, 7 మ్యా చుల్లో 13 క్యాచులు వదిలేసింది. సూపర్ 8 వరకూ వచ్చిన ఏ టీమ్ కూడా ఇన్ని క్యాచులు డ్రాప్ చేయలేదు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా వంటి ఫీల్డర్లు కూడా క్యాచులు అందుకోలేకపోతున్నారు.రిస్కీ క్యాచులను అందుకునే ప్రయత్నంలో జారవిడిచారంటే పర్వాలేదు.

కానీ చేతుల్లోకి వచ్చిన క్యాచులను కూడా  భారత ఫీల్డర్లు అందుకోలేకపోతున్నారు. వెస్టిండీస్ 195 పరు గుల భారీస్కోరు చేసిందంటే దానికి పరోక్షంగా భారత ఫీల్డర్లు కూడా కారణమయ్యారు. క్యాచ్‌లు వదిలేయడంతోనే బతికిపోయిన హోప్ , ఛేజ్, హోల్డర్ మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచింది కాబట్టి దీనిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయితే ఇంగ్లాండ్‌తో కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ఖచ్చితంగా ఫోకస్ పెట్టాల్సిన అంశం ఫీల్డింగే.. ముఖ్యంగా క్యాచ్‌లు అందుకోవడంపై ఇంకా దృష్టిసారించాలి.

ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటర్లకు ఇంకొక అవకాశం మన ఫీల్డింగ్ ద్వారా వచ్చిందంటే వారిని అడ్డుకోవడం కష్టం. ఇది లా ఉంటే బ్యాటింగ్‌లో నిలకడలేమి కూడా వెంటాడుతోంది. ప్రత్యర్థి స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మన బ్యాటర్లు తడబడుతున్నారు. అటు బౌలింగ్ కూడా ఇంకా పూర్తిస్థాయిలో గాడినపడలేదు. సెమీఫైనల్ కు ఇంకా మూడురోజుల సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో వీటిపై దృష్టి పెడితే ఇంగ్లాండ్‌కు చెక్ పెట్టి ఫైనల్‌కు చేరడం పెద్ద కష్టం కాదు.