calender_icon.png 19 February, 2026 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల కొరత లేదు

19-02-2026 05:08:57 PM

ఫెర్టిలైజర్ యాప్ వినియోగించాలి జిల్లాలో ఎరువుల కొరత లేదు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

తంగళ్ళపల్లి: రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులు నివారించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ(State Agriculture Department) రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్ సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. గురువారం తంగళ్ళపల్లిలోని గ్రోమోర్ ఎరువుల దుకాణంలో ఇంచార్జి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా ఎంతమంది రైతులు ఎరువులు బుక్ చేసుకున్నారో, ఎంతమంది తీసుకువెళ్లారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించి, యాప్ ద్వారా కొనుగోలు చేసిన రైతుల వివరాలను సరిచూశారు. దుకాణంలో నిన్నటి రాత్రి మరియు ఈరోజు ఉదయం స్టాక్ వివరాలను తనిఖీ చేయడంతో పాటు, గోదాంలో ఉన్న ఎరువుల నిల్వలను సిబ్బందితో లెక్కింపజేసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులందరూ ఫెర్టిలైజర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని దాని ద్వారానే ఎరువులు బుక్ చేసుకోవాలని సూచించారు. అన్ని ఎరువుల దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో హెల్ప్‌డెస్క్ మరియు సహాయకులు అందుబాటులో ఉంటారని తెలిపారు. యాప్ వినియోగంపై రైతులకు పూర్తి సహాయం అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు.

జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 92,735 యూరియా సంచులు వచ్చాయని, యాప్ ద్వారా 84,068 మంది రైతులు బుకింగ్ చేసుకున్నారని వెల్లడించారు. వీరిలో 79,948 మంది ఎరువులు కొనుగోలు చేయగా, ఇంకా 11,694 సంచులు నిల్వ ఉన్నాయని తెలిపారు. 740 మంది రైతులు బుకింగ్ చేసుకుని ఇంకా ఎరువులు తీసుకుపోలేదని వివరించారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. ఈ తనిఖీలో ఏడీఏ ప్రదీప్, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.