16-02-2026 12:00:00 AM
గుండాల, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేరుకు ఇద్దరు డాక్టర్లు ఉన్నా చికిత్స మొత్తం ఏఎన్‌ఎం ల మీదనే ఆధారపడుతుంది. మండల కేంద్రంలో పరిస్థితి ఇలా దయనీయ స్థితిలో ఉన్నా కూడా కనీసం ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ, ఉన్నతాధికారులు గానీ పట్టించుకునే పాపాన పోవట్లేదనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి.అత్యవసర పరిస్థితులలో వైద్యాధికారులు అందుబాటులో లేక సరైన వైద్యం అందక రోగుల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయినా ఇప్పటివరకూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యుల తీరు మారకపోవడం గమనార్హం.
ఉన్న ఇద్దరిలో ఒక డాక్టర్ సెలవు పెట్టి పెళ్లి పనులలో బిజీగా ఉండగా, ఇంకో డాక్టర్ ఇంటికెళ్లి అందుబాటులో లేకపోవడంతో ఏఎన్‌ఎంలే పూర్తి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి పీహెచ్సీలో ఏర్పడింది. ప్రతీ శని, ఆదివారాలలో వైద్యులు పీహెచ్సీలో ఉండడం లేదని రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ట్రీట్మెంట్ కు వచ్చిన రోగులకు ఏఎన్‌ఎం లే చికిత్స అందిస్తున్నారు. మండల వైద్యాధికారి కుర్చీ ఖాళీగా దర్శనమిస్తోంది.
ఈ విషయంపై చికిత్స అందిస్తున్న ఏఎన్‌ఎం ను వివరణ అడగగా ఒక డాక్టర్ సెలవులో ఉన్నారని, డ్యూటీలో ఉన్న డాక్టర్ సోమవారం నుండి శుక్రవారం వరకూ విధులను నిర్వర్తించి ఇంటికి వెళ్ళారని తెలిపారు. డాక్టర్లు అందుబాటులో లేకపోతే రోగులు మెరుగైన వైద్యానికి మండల కేంద్రం నుండి సుమారు 60 కిలోమీటర్ల నుండి 110 కిలోమీటర్ల దూరం ప్రయాణించక తప్పదు.
ఏదీ ఏమైనా మండల ప్రజలు మొత్తం చికిత్సకు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపైనే ఆధారపడుతున్నా, వైద్యులు అందుబాటులో లేక నానా అవస్థలుపడుతున్నారు. 24 గంటలు చికిత్స అందించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శని, ఆదివారాలలో కూడా వైద్యులు అందుబాటులో ఉండాలని మండల ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వైద్యాధికారి వివరణ
పీహెచ్సీ వైద్యాధికారి సుధీప్ ను వివరణ కోరగా సోమవారం నుండి శుక్రవారం రాత్రి వరకూ డ్యూటీ చేశానని, శనివారం నా పుట్టినరోజు ఉండడంతో ఇంటికి వచ్చానని, ఒక్క డాక్టర్‌నే ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని, నైట్ డ్యూటీలు ఎక్కువ అవుతున్నాయని తెలిపారు.