2 July, 2026 | 2:58 AM

వైటీపీఎస్ ప్రైవేటీకరణ టెండర్ రద్దు చేయాలి

02-07-2026 01:38 AM

కేటీపీపీ, టీజీపీ,ఈజేఏసీ డిమాండ్.. నల్ల బ్యాడ్జీలతో భారీ బైక్ ర్యాలీ

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూలై 1 (విజయక్రాంతి): వైటీపీఎస్లోని సీహెచ్పీ, ఏహెచ్పీ విభాగాల నిర్వహణను మూడు సంవత్సరాల కాలానికి రూ.255 కోట్ల వ్యయంతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేటీపీపీ, టీజీపీ, ఈజేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

కేటీపీపీ ప్రధాన గేటు నుండి సర్వీస్ భవనం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని వైటీపీఎస్ ప్రైవే టీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగ సంఘా లు, వివిధ యూనియన్లు, ఇతర ఉద్యోగ సంఘాలు  కార్మిక సంఘ ప్రతినిధులు, సభ్యులు పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ, వైటీపీఎస్ను ప్రైవేటీకరించే చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, మూడు సంవత్సరాల కాలానికి రూ.255 కోట్లతో పిలిచిన టెండర్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ ఉత్పత్తి సంస్థ యాజమాన్యం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను గౌరవించి టెండర్ను రద్దు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత విస్తృతం చేస్తామని హెచ్చరించారు.