టీఎంసీదే విజయం
226 స్థానాలకుపైగా మేమే గెలుస్తాం
టీఎంసీ జోరును ఎగ్జిట్‌పోల్స్, బీజేపీ ఆపలేవు
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా, ఏప్రిల్ 30: పశ్చిమబెంగాల్‌లో అత్యంత మెజార్టీతో టీఎంసీ గెలుస్తుందని, 226 స్థానాలకు పైగా విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. టీఎంసీ జోరును ఏ ఎగ్జిట్‌పోల్స్, బీజేపీ ఆపలేవని స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజున అన్ని కేంద్రాల వద్ద 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తలను ప్రజలను కోరారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను లెక్కచేయొద్దని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, 226 సీట్ల మార్కు ను దాటి టీఎంసీ భారీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, మద్ద తుదారులను ఉద్దేశించి గురువారం ఒక వీడియోను ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘మా- మాటి -మానుష్’ స్ఫూర్తితో టీఎంసీ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావడానికి పశ్చిమ బెంగాల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ అంతటా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అవస రమైతే, ‘నా సొంత (భవానీపూర్) నియోజకవర్గంలో నేనే స్వయంగా కాపలా కాయడానికి బయటకు వస్తా’ అని వెల్లడించారు. మరోవైపు బీజేపీకి ఆధిక్యం వస్తుందని అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్‌పై మమతా బెనర్జీ ఆగ్ర హం వ్యక్తం చేశారు. టీఎంసీ కార్యకర్తలను నిరుత్సాహపరిచేందకు ఒక రాజకీయ కుట్ర లో భాగంగానే అవి ఉన్నాయని ఆమె ఆరోపించారు. ‘మేము 226 సీట్ల మార్కును దాట డానికి సిద్ధంగా ఉన్నామని వారికి తెలుసు’ అని, టీఎంసీ జోరును ఏ శక్తులూ ఆపలేవని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ పదేపదే బోల్తాపడుతున్నాయని తెలిపారు.
ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ బెదిరింపులకు వ్యతిరేకంగా ‘జీవన్మరణ పోరాటం‘ చేసిన టీఎంసీ కార్యకర్తలను ఆమె ప్రశంసించారు. కొన్ని ప్రాంతాల్లో కేంద్ర బలగాలు, పోలీసు సిబ్బంది మితిమీరారని ఆరోపించారు. అయితే బుధవారం ఎన్నికలు బెంగాల్ ఎన్నికలు ముగిశాయి. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.






