బరితెగించిన రియల్ మాఫియా
- కబ్జాకోరల్లో చెరువులు, పార్కులు
- నిబంధనలకు నీళ్లొదులుతున్న బల్దియా
- 200 గజాల్లోనే ఆరంతస్తుల నిర్మాణాలు
- కనుమరుగైన ఫైర్ సేఫ్టీ, సెట్ బ్యాక్
- కమిషనర్ స్పందించి అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్థానికుల డిమాండ్
మణికొండ, మార్చి 26 (విజయక్రాంతి): మణికొండ, నార్సింగి సర్కిల్ పరిధిలో రియల్ ఎస్టేట్ మాఫియా బరితెగించింది. అధికారుల అండదండలతో నిబంధనలను గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలకు పాల్పడుతోంది. జనచైతన్య లేఅవు ట్లో ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జాకు గురవుతున్నా, లేబర్ క్యాంపుల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పర్యవేక్షించాల్సిన యంత్రాంగం నిద్రమత్తులో జోగుతోంది.
పచ్చని పార్కులను కాం క్రీట్ జంగిల్గా మారుస్తున్న బడా బిల్డర్ల ఆగడాలను, ముడుపులు తీసుకుంటూ అక్రమా లకు వంతపాడుతున్న అధికారుల తీరుపై జనచైతన్య కాలనీ వైస్ ప్రెసిడెంట్ వంశీకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గండిపేట మండలం నార్సింగి సర్కిల్, మణికొండ, అల్కాపురి టౌన్ షిప్, మంచిరేవుల, కోకాపేట, వట్టినాగులపల్లి ప్రాంతాలు అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్గా మారాయి. కేవలం 200 గజాల స్థలంలోనే డబుల్ సెల్లార్లతో ఆరు నుంచి ఎనిమిది అంతస్తుల వరకు భారీ భవనాలు నిర్మిస్తున్నారు.
కనీస సెట్ బ్యాక్, ఫైర్ సేఫ్టీ ఊసే లేదు. టౌన్ ప్లానింగ్, మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు మాఫియాతో కుమ్మక్కై అందినకాడికి దండుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు రెండు, మూడు మున్సిపాలిటీల అదనపు బాధ్యతలు అప్పగించడంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పూర్తి గా గాలిలో కలిసిపోయింది. భవనాలకు లక్ష ల్లో పన్ను వసూలు చేయాల్సి ఉండగా, అధికారుల జేబులు నిండుతుండటంతో వేలల్లో నే రశీదులు ఇస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు.
ఎల్లమ్మ చెరు వు సమీపంలోని ల్యాంకో హిల్స్, జనచైతన్య లేఅవుట్ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. జనచైతన్య లేఅవుట్లోని ఏకంగా నాలుగు పార్కులను రియల్ మాఫి యా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టింది. ఎల్ల మ్మ చెరువు నుంచి పారే కాలువను సైతం పైపులతో మూసివేసి నాలాలను ఆక్రమించి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. మరోవైపు నిర్మాణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లేబర్ క్యాంపులు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రి వేళల్లో దొంగతనాలు, గంజాయి సేవించడం, గొడవలతో ఆ ప్రాంతమంతా అసాంఘిక శక్తుల కు అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ భవనాలు వెలుస్తున్నా స్థానికంగా కనీస మౌలిక సదుపా యాలు కల్పించడంలో అధికార యంత్రాం గం విఫలమైంది. డ్రైనేజీలు, రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోడ్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే నిధులు మంజూరు చేసినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మణికొండ మున్సిపాలిటీని జీహెచ్‌ఎంసీలో కలపడంతో, టెండర్ పూర్తయ్యాక జీహెచ్‌ఎంసీ నుంచి బిల్లులు వస్తా యో రావో అన్న భయంతో కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తున్నారు. నార్సింగి, జనచైతన్య కాలనీ, అంజలీ నగర్, శ్రీరామ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా సాగుతున్న ఈ అక్రమ నిర్మాణాల వెనుక టౌన్ ప్లానింగ్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టాయి.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి, అనుమతులు ఉల్లంఘించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయడం తో పాటు, అవినీతికి పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో రంగంలోకి దిగిన ‘హైడ్రా’ అధికా రులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్నారు. పార్కులు, ఎమినిటీ స్థలా ల్లో అక్రమంగా అనుమతులు పొంది చేపట్టిన నిర్మాణాలను గుర్తిస్తున్నారు.
ఇందులో భా గంగా మణికొండ పరిధిలో దాదాపు నిర్మా ణం పూర్తయిన మూడు బహుళ అంతస్తుల భవనాలను హైడ్రా అధికారులు తాజా గా సీజ్ చేశారు. ఈ చర్యలతో అక్రమార్కు ల్లో గుబులు మొదలైంది. ఇదే తరహాలో పరిధిలో కొనసాగుతున్న మిగిలిన అక్రమ ని ర్మాణాలను, కబ్జాలను కూడా వెంటనే గుర్తిం చి ఆ భవనాలను నేలమట్టం చేయాలని కోరుతూ స్థానికులు పెద్ద ఎత్తున హైడ్రా అధికారులకు దరఖాస్తులు సమర్పిస్తున్నారు.




