29 March, 2026 | 3:21 AM

తెలంగాణ తరహా ఉద్యమం

29-03-2026 01:41 AM
  1. బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే పోరాటమే మార్గం
  2. ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జే పూర్ణచంద్రరావు

ఖైరతాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): బీసీలకు విద్య, కాలజ్ఞానం ఉంటే సరిపోదు.. కావాల్సింది కులజ్ఞానం అని రిటైర్డ్ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డా. జే పూర్ణచంద్రరావు స్పష్టంచేశా రు. రాష్ట్రంలో బీసీల సామాజిక, రాజకీయ హక్కులు కేవలం హామీలతో సాధ్యం కావ ని, తెలంగాణ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని దీర్ఘకాలికంగా, క్రమబద్ధంగా పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయ న తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీల ఆత్మగౌరవ పోరాట స మితి కన్వీనర్ డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగం నడుస్తోందా?.. కుల రాజ్యాంగం నడుస్తుందా? ఇక్కడ నడిచేది కుల రాజ్యాంగ మే ఈ కుల రాజ్యాంగంలోని పద్ధతుల వల్లనే ఈ రోజు తెలంగాణలో 41 బీసీ ఆత్మగౌరవ భవనాలు ఈ దుస్థితిలో ఉన్నాయి.  దీనికి మూలకారణం ఏమిటో మనం చూడాలి. అన్నింటికీ మూల కార ణం కులమే చూడండి. ఎంత మాయ చే స్తారో.. 2018లో  ఏరకంగా చెప్పారు. ఎలక్షన్లు వస్తున్నాయి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల ఓట్లు కావాలి. ఎస్సీలకు ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పడం, ఆ తర్వాత ఈ కుల సంఘాలను ఆకట్టుకోవడం కోసం భూములివ్వడం, వాళ్లందరూ ఆ పార్టీ కోసం పనిచేయడం కోసం ట్రస్టులు ఏర్పాటు చేసుకోండి..

మీరే  ఆ ల్యాండ్‌ను వాడుకోం డి మీకే డబ్బులు ఇస్తామని చెప్పడంలో పరమార్థం గ్రహించాలి’ అని అన్నారు. ‘ట్రస్టు లు పెట్టడమేమిటీ? మిమ్ములను నడుపుకోమనడమేంటీ? డబ్బులు రిలీజ్ చేయడ మనడమేమిటీ? ఈ ట్రస్టు చైర్మన్లు మరీ ఒక టెండరూ.. ప్రొసీజర్ ఫాలో కాకుండా..  నామినేషన్ పద్ధతులు ఇవ్వడమేంటీ? ఏమి టీ ఇదంతా? ఇదంతా తెలియకుండా జరుగుతుందా?  మనల్ని ఏలేటి కమ్మ, రెడ్డి, వెల మ వర్గాలు మనం కొట్లాడుకోవాలనే ఈ ఎత్తులు వేస్తాయి. బీసీలు ఐక్యం కావొద్దు. కొట్లాడుకోవాలని చూస్తారు.. కాబట్టి కుల జ్ఞానంతో మనం వ్యవహరించినప్పుడే ఈ రాజకీయాలు అర్థమవుతాయి, అంతమవుతాయి.

అందుకనే ఈ భవనాల వద్ద మనం చేయాల్సిన పని ఏంటంటే.. మన వాళ్లను సమీకరించి అక్కడ హెచ్చరికగా.. ధర్నాలు, ఉద్యమాలు చేయాలి.  ప్రతి కుల సంఘంలో ప్రతి లీడరు , క్యాడరు ఒక అల్టిమేటం ఇవ్వా లి. ఆ అల్టిమేటం రోజుకీ..  ప్రతి భవనం ఎంత మందిని మనం సమీకరించగలం.. అనే దానితోనే.. ప్రభుత్వాలు దిగి వస్తాయి.  అంతేగాని మనం ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా.. చూద్దాం.. చేద్దాం.. దీని మీద ఓ కమిటీ వేశాం.. ఇక రకరకాల కారణాలు చెప్తారు. అందుకే మనం జాగరూకతతో ఉండాలి. ఎవరినీ ఎప్పుడూ నమ్మకూడదు.. కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వాలు వందలు, వేల కోట్లు విలువచేసే   భూములు ఇస్తున్నాయని విషయాన్ని మనం గమనించాలి.

ఈ రోజున ఈ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో.. జరుగుతున్నది నిరంతరం కొనసాగితే.. మీలోనే ఎమ్మెల్యేలు అవుతారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వేదిక నుంచే మీలో చాలా మంది ఎమ్మెల్యేలు కావాలి. వచ్చే ప్రతి ఎన్నికలో కంటెస్ట్ చేసే విధంగా తీసుకోవాలి’. అని పూర్ణచంద్రరావు చెప్పారు. భూముల కేటాయింపులు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయని, ట్రస్టుల పేరుతో భూములు ఇచ్చి, వాటి నిర్వహణ బాధ్యతలను అదే వర్గాలపై నెట్టివేయడం సరైన పద్ధతి కాదని ఆయన విమ ర్శించారు.

టెండర్ విధానాలు పాటించకుండా నామినేషన్ పద్ధతులు అనుసరించ డం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. భూముల కేటాయింపులో స్పష్టత లేకపోవడం, హద్దులు నిర్దేశించకపోవడం వల్ల వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పా రు. తెలంగాణలో బీసీలకు ఆత్మగౌరవ భవన నిర్మాణాల కోసం అప్పటి ఐఏఎస్ అధికారిగా బుర్రా వెంకటేశం ఉన్నారు కనుకనే జీవోలు జారీ అయ్యాయని అన్నారు. 

తెలంగాణ ఉద్యమం ఆదర్శం

తెలంగాణ ఉద్యమం ఆదర్శంగా.. ఆనా డు రాజకీయ నాయకులు ప్రజల ఒత్తిడికిలోనై స్పందించాల్సి వచ్చిందని, అదే విధం గా బీసీ ఉద్యమం బలపడితే అన్ని పార్టీల నేతలు డిఫెన్స్‌లో పడతారని చెప్పారు. ఉద్యమం బలంగా ఉంటే నాయకులే స్వ యంగా ముందుకు వచ్చి మద్దతు ప్రకటిస్తారని పేర్కొన్నారు. బీసీలు కేవలం ఓటర్లుగా కాకుండా, నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఎన్నికలో బీసీలు పోటీచేసే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు.

ఫొటోలు, హామీలతో కాకుండా, నిరంతర పోరాటం ద్వారానే హక్కులు సాధించాలి అని ఆయన స్పష్టం చేశారు. బీసీల ఐక్యత, అవగాహన, ఉద్యమాల ద్వారానే సమాజంలో సమాన హక్కులు సాధ్యమని పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ విఠల్, ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అల్లదుర్గం సురేష్ ముదిరాజ్, పోల్కం లక్ష్మీనారాయణ, శివ ముదిరాజ్, విజయ్, జస్వంత్, కొండ వెంకటేశ్, అలేఖ్య, ప్రత్యేష తదితరులు పాల్గొన్నారు.

అభినందించాలి..

ఉద్యమానికి మద్దతుగా నిలిచే మీడియా ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి అభినందించాల్సిన అవసరం ఉందని పూర్ణచంద్రరావు తెలిపారు. ‘ బీసీలకు మద్దతునిస్తున్న మీడియా ప్రముఖులను సన్మానించుకోవాలి, మనం వారితో ఐడెంటిఫై కావాల్సివుంది. బీసీల కోసం విజయక్రాంతి దినప్రతిక ౮౯శాతం కవరేజీ ఇస్తుంది. చిన్న చానళ్ల నుంచి పెద్ద పత్రికల వరకు బీసీల కోసం నిలబడుతున్న వారిని మనం గౌరవించుకోవాలి’ అని ఆయన చెప్పారు. 

పోలవరం ప్రాజెక్టు కారణంగా లక్షలాది ఆదివాసీ కుటుంబాలు తమ భూములు, ఇళ్లు కోల్పోతున్నప్పటికీ, వారికి తగిన ప్రయోజనాలు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందాల్సింది నష్టపోయిన వారేనని, కానీ వాస్తవంలో వారికి సరైన పునరావాసం అందించడం లేదని విమర్శించారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతల ఘటనలను ప్రస్తావిస్తూ, ఈ బుల్డోజర్ సంస్కృతి ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ప్రజల్లో భయం కలిగిస్తాయని అన్నారు.