నేత్రపర్వం రాముడి పట్టాభిషేకం
- రామనామ స్మరణతో మార్మోగిన మిథిలా ప్రాంగణం
- పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- స్వామివారికి ప్రత్యేక పూజలు
- ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరి మార్ట్ ప్రారంభం
భద్రాచలం, మార్చి 28 (విజయక్రాంతి): భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేక మహోత్సవం శనివారం కనుల పండువగా జరిగింది. మిథిలా ప్రాంగణంలో శనివారం అత్యంత వైభవంగా జరిగిన ఈ మహోత్సవంలో దేశ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి, పట్టాభిషేకాన్ని తిలకించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా మహోత్సవానికి హాజరై స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రా లను సమర్పించి ఆశీస్సులు పొందారు.
పట్టాభిషేక వేడుకలు సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. తొలుత రామాలయంలో భద్రుడి మండపంలో స్వామివారి పాదుకలకు అభిషేకం నిర్వహించారు. అనంతరం గౌతమీ నదీ తీరం నుంచి పవిత్ర తీర్థములను తీసుకువచ్చి రాజ లాంఛనాలతో మిథిలా ప్రాంగణానికి ఊరేగింపుగా స్వామివారిని తీసుకువచ్చారు. భాజా భజంత్రీల నాదాలు, సన్నాయి మేళా లు, భక్తుల కోలాటాలతో ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. కళ్యా ణ మండపంలో స్వామివారు ఆశీనులైన అనంతరం విశ్వక్‌సేన ఆరాధన, పుణ్యాహవాచనం నిర్వహించారు.
తరువాత పాదుక లు, రాజదండం, రాజముద్రిక, స్వర్ణ కిరీటం, ఖడ్గం, రత్నాభరణాలతో స్వామివారికి రాజలాంఛనాలు అలంకరించి పట్టాభిషేక కార్య క్రమాన్ని నిర్వహించారు. రుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద పారాయణాలతో పాటు విష్ణు పురాణం, భగవత్ పారాయణాలు జరిగాయి. పుష్కర జలాలతో మహా కుంభ తీర్థప్రోక్షణ నిర్వహించగా, అనంతరం హారతులు సమర్పించారు. పట్టాభిషేక వేడుకల సందర్భంగా మిథిలా ప్రాంగణం మొత్తం శ్రీరామ నామ స్మరణల తో మార్మోగింది. కార్యక్రమం అనంతరం భక్తులపై పుణ్య నదీ జలాలను చల్లి ఆశీర్వదించారు.
ఈ మహోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఐటీడీఏ పీఓ రాహుల్, దేవస్థానం ఈవో దామోదర్‌రావు పాల్గొన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా సుమారు రూ. 350 కోట్ల వ్యయం తో ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించినట్లు తెలిపారు.
గిరిమార్ట్ ప్రారంభించిన గవర్నర్
ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరి మార్ట్‌ను గవర్నర్ శివప్రతాప్ శుక్లా సతీసమేతంగా ప్రారంభించారు. గిరిజనుల ఆర్థికాభి వృద్ధి, వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడమే లక్ష్యంగా ఈ గిరి మార్ట్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అటవీ ఉత్పత్తులు, సేంద్రీయ ఆహార పదార్థాలు, గిరిజన హస్తకళా వస్తువులను ఒకే వేదికపై విక్రయానికి అందుబాటులో ఉంచడం ద్వారా గిరిజనులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. గిరి మార్ట్ ప్రారంభానంతరం అక్కడ అమ్మకానికి ఉంచిన గిరిజన ఉత్పత్తులను గవర్నర్ సతీసమేతంగా పరిశీలించి, వాటి ప్రత్యేకతలు, తయారీ విధానం, మార్కెటింగ్ సదుపాయాల గురించి కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.




