ఇద్దరు పిల్లల్ని చంపి, తల్లి ఆత్మహత్య
- రోడ్డు ప్రమాదంలో భర్త మరణంతో మనస్థాపం
సంగారెడ్డి జిల్లా జుల్కల్‌లో ఘటన
సంగారెడ్డి, మార్చి 28 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో భర్త మరణించడం.. పిల్లల భవిష్యత్తు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురై ఓ తల్లి తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి హత్య చేసి, తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. కంది మండలం మక్త అల్లూరు గ్రామానికి చెందిన మమత(35)కు, అదే మండలం జుల్కల్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌తో వివాహం జరిగింది.
వీరికి కుమారుడు మణికంఠ(5), కుమార్తె ప్రణయశ్రీ (4) ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త ప్రవీన్ మృతి చెందాడు. దీంతో మమత, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు. గత్యంతరం లేక మమత తన ఇద్దరు పిల్లలతో కలిసి అదే గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. భర్తను కోల్పోవడం, పిల్లల భవిష్యత్తు, ఆర్థిక ఇబ్బందుల వల్ల తీవ్ర ఆందోళనకు గురైంది.
దీంతో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్పీ పరితోష్ పంకజ్, డీఎస్పీ సత్తయ్యగౌడ్ ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.




