calender_icon.png 8 February, 2026 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకతీయ కళావైభవానికి ప్రతీక త్రికూటేశ్వరాలయం

08-02-2026 12:12:12 AM

కాలగర్భం నుంచి అపురూప కట్టడం వెలుగులోకి..

శైవ వైష్ణవ మతాలకు ప్రతీకగా, కాకతీయుల శిల్పకళా వైభవాన్ని చాటుతోంది.. ప్రాచీన త్రికూటేశ్వర ఆలయం. దాదాపు 11వ నుంచి 13వ శతాబ్దాల మధ్య నిర్మితమైందని చరిత్రకారులు భావిస్తున్న ఈ ఆలయం నిర్మాణ శైలి, శిల్ప నైపుణ్యం, గర్భగృహాల రూపకల్పన వంటి విశిష్ట లక్షణాలతో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. శివుడు, సూర్యుడు, విష్ణుమూర్తి గర్భాలయాలతో కూడిన త్రికూట నిర్మాణం గత కాలపు ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమన్వయాన్ని ప్రతిబింబిస్తోంది.

హనుమకొండ జిల్లాభీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామ పరిసరాల్లో వెలుగులోకి వచ్చి న ప్రాచీన త్రికూటేశ్వర ఆలయం ఒకప్పుడు ఆంధ్రదేశంలో మహా సామ్రాజ్యంగా విస్తరించిన కాకతీయుల సామ్రాజ్యం.  రుద్రదేవుని కాలంలో 1158-- 1185 వరంగల్ కోటను ప్రారంభించగా గణపతి దేవుడు చక్రవర్తిగా ఉన్న సమయం లో  ఆలయాల నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తుంది.

గణపతి దేవునికి రుద్రమదేవికి రాజ గురువు విశ్వేశ్వర శివాచార్య రుద్రమదేవి కోరిక మేరకు కాకతీయ సామ్రాజ్యంలోని అన్ని గ్రామాల్లో శివాలయాలు ప్రతిష్టించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.  కాలక్రమేణా నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయం, చెట్లు, చేమల మధ్య పొదల మరుగున పడింది. ప్రస్తుతం నిత్య ధూపదీప నైవేద్యాలతో పూజలు పునరుద్ధరించ బడటం, ధ్వజస్తంభం, నవగ్రహాలు, నంది ప్రతిష్ఠకు ఏర్పాట్లు చేయడం వంటి చర్యలు స్థానికుల భక్తి, బాధ్యతను తెలియజేస్తున్నాయి. 

కళాత్మక శిల్పాలు.. కాకతీయుల శిల్ప సంపద

ఆలయంలో కనిపించే గణపతి, ఆంజనేయ వంటి కళాత్మక శిల్పాలు కాకతీయుల శిల్ప సంపదను ప్రతిఫలింపజేస్తు న్నాయి. అయితే శాసనాలు లేకపోవడం, కోనేరు భూమిలో కూరుకుపోవడం, విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసం కావడం వంటి అంశాలు తక్షణ సంరక్షణ అవసరాన్ని సూచిస్తున్నా యి. ఇలాంటి చారిత్రక వారసత్వ కట్టడాల పరిరక్షణ కేవలం గ్రామస్థుల బాధ్యత మాత్రమే కాదు ప్రభుత్వ యంత్రాంగం, పురావస్తు శాఖలు సమన్వయంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

కాకతీయుల చరిత్రపై మరింత పరిశోధనల కు కూడా మార్గం సుగమమవుతుంది. త్రికూటేశ్వర ఆల యం పునరుజ్జీవనం కేవలం ఒక దేవాలయ సంరక్షణ కాద ని, తెలుగు సంస్కృతి మూలాలను కాపాడుకునే సామూహిక సంకల్పానికి ప్రతీక అని భావించాలి. భవిష్యత్ తరాలకు మన వారసత్వాన్ని అందించాలంటే ఇలాంటి చారిత్రక సంపదలను సంరక్షించడం అత్యవసరం. ముత్తారం త్రికూటేశ్వర ఆలయం ఆ దిశగా ఆశాకిరణంగా నిలుస్తోంది.   

 గౌడ బాలాజీ, భీమదేవరపల్లి