08-02-2026 12:00:00 AM
ప్రతిభ, సృజనాత్మకతకు సరిహద్దులు ఉండవని నిరూపిస్తున్నాడు.. వరంగల్‌కు చెందిన యువ కళాకారుడు సరుగు రిషికేష్. బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే డూడుల్ ఆర్ట్‌లో నైపుణ్యాన్ని సంపాదించారు. గంటల తరబడి ఏకాగ్రతతో పనిచేయడం, ప్రతి గీత కూ అర్థం ఉండేలా చిత్రాన్ని మలచడం ఆయన కళకు ప్రాణంగా మారింది.
సాధారణంగా కనిపించే చిత్రాలు, చిన్న చిన్న ఆకారాల సమ్మేళనంతో విశిష్టమైన భావ ప్రపంచాన్ని ఆవిష్కరించే డూడుల్ ఆర్ట్ ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. కాగితంపై అలా మొదలైన గీతలు క్రమంగా జీవంతో నిండిన కళాఖండాలుగా రూపాంతరం చెందడంతో రిషికేష్ ప్రత్యేకతగా నిలుస్తోంది. తను చూసిన చిత్రానికి డూడుల్ ఆర్ట్ ద్వారా అలవోకగా చేసే గీతల కళగా కాకుండా, లోతైన ఆలోచనలు, భావోద్వేగాలు, సామాజిక సందేశాలను ప్రతిబింబించే మాధ్యమంగా మార్చడంలో రిషికేష్ తనదైన శైలిని ప్రదర్శిస్తున్నాడు.
ప్రతి చిత్రంలోనూ సూక్ష్మమైన వివరాలు, సమతుల్యమైన డిజైన్, ఆకర్షణీయమైన కాంపోజిషన్ కనిపిస్తాయి. ముఖ్యంగా ఆయన చిత్రాల్లో సహజసిద్ధంగా ఒదిగిపోయే ఆకృతులు చూసేవారిని క్షణాల్లో ఆకట్టుకుంటున్నాయి. సాధారణ పెన్సిల్, పెన్‌తోనే అద్భుతమైన చిత్రాలను తన చేతితో ఆవిష్కరించే రిషికేష్, నిరంతర సాధనతో ఈ నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారు. గంటల తరబడి ఏకాగ్రతతో పనిచేయడం, ప్రతి గీతకూ అర్థం ఉండేలా చిత్రాన్ని మలచడం ఆయన కళకు ప్రాణంగా మారింది.
డూడుల్ ఆర్ట్ ద్వారా తన భావాలను వ్యక్తపరచడమే కాకుండా, యువతలో కళపై ఆసక్తిని పెంచాలన్నదే తన లక్ష్యమని రిషికేష్ చెప్పాడు. ఇప్పటికే పలువురు కళాభిమానుల ప్రశంసలు అందుకుంటున్న రిషికేష్ చిత్రాలు సోషల్ మీడియా వేదికలపై కూడా మంచి స్పందన పొందుతున్నాయి. సంప్రదాయ కళకు ఆధునిక స్పర్శను జోడిస్తూ, డూడుల్ ఆర్ట్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తున్న రిషికేష్ భవిష్యత్తులో మరిన్ని విశిష్టమైన కళాఖండాలను అందిస్తాడన్న నమ్మకాన్ని ఆయన ప్రతిభ కలిగిస్తోంది.
* వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని వివిధ ప్రదేశాల్లో 2024లో ప్రతిష్ఠించిన ప్రత్యేకత కలిగిన గణేశ్ విగ్రహాలను ఆధారంగా తీసుకుని నేను ఈ డూడిల్ను రూపొందించాను. వాటి వైవిధ్యం, కళాత్మకత నన్ను ఆకట్టుకున్నందు వల్ల, వరంగల్‌లోని ముఖ్య ఆకర్షణలను ఈ ఒక్క కళాఖండంలో చూపించే ప్రయత్నం చేశాను.
* ఈ చిత్రాన్ని కాంతారా సినిమా నుంచి ప్రేరణగా తీసుకుని నేను గీశాను. సినిమాలో హీరో సాధారణ మనిషిగా కనిపిస్తాడు, కానీ దేవుడు ఆవహించినప్పుడు అతనిలో దివ్యరూపం వ్యక్తమవుతుంది. ఆ భావనను చూపేందుకు ఒకే చోట రెండు ముఖాలను చిత్రించాను. ఎరుపునీలంగా చూస్తే, ఎరుపు వైపు చూసినప్పుడు దేవత అవతారం కనిపిస్తే, నీలం వైపు చూసినప్పుడు హీరో రూపం కనిపిస్తుంది
* ఎడమవైపు ఉన్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్‌లోని ఐకానిక్ రిఫరెన్స్ ఇమేజ్ ఆధారంగా తీసుకుని, కుడివైపు నా ప్రతిబింబంగా ఈ విరాట్ కోహ్లీ స్కెచ్‌ను చిత్రించాను. ఆ క్షణంలోని భావోద్వేగం, ఆత్మవిశ్వాసం, పోరాట స్ఫూర్తిని నా కళలో చూపించే ప్రయత్నమే ఈ డ్రాయింగ్.
బండి సంపత్‌కుమార్,
మహబూబాబాద్, విజయక్రాంతి