calender_icon.png 8 February, 2026 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలస కార్మికులకు.. ఉపాధి కేంద్రంగా తెలంగాణ

08-02-2026 12:58:35 AM

ఇది యాదృచ్ఛికం కాదు.. కేసీఆర్ వ్యవసాయ విప్లవం

  1. ‘రైతుబంధు’తో రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణం 
  2. రైతుకు భరోసా.. కార్మికుడి ఉపాధి.. కేసీఆర్ చలవే..
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) : దేశంలో వలస కార్మికులకు ఉపాధి కల్పించే ప్రధాన వ్యవసాయ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఒకప్పుడు కరువుతో,ఉపాధి లేక తెలంగాణ నుంచి ప్రజలు వలస వెళ్లారని.. కానీ అదే తెలంగాణ ఈ రోజు దేశం నలుమూలల నుంచి వచ్చే వలసలను ఆదుకుంటున్నదని స్పష్టం చేశారు.

ఈ మార్పు యాదృచ్ఛికం కాదని.. ఇది కేసీఆర్ వ్యవసాయ విప్లవమని ప్రశంసించారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. నీళ్లు లేక పొలాలు ఎండిపోయిన రోజుల్లో వ్యవసాయం అంటే నష్టం అనే భావన ఉండేదని, కానీ కేసీఆర్ నీళ్లే జీవనాడి అని గుర్తించి కాళేశ్వరం వంటి చారిత్రక ప్రాజెక్టులతో రైతు పొలానికి శాశ్వత భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. నీళ్లు వచ్చాయి.. పంట వచ్చిందని, ఒక పంట కాదు రెండు, మూడు పంటలుగా.. సాగు విస్తరించిందని తెలిపారు. భూమి పని కోరింది.

పంట పెరిగితే పని వచ్చిందని వెల్లడించారు. పని పెరిగితే వ్యవసాయ కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి లభించిందని, అందుకే ఈరోజు తెలంగాణ బీహార్, ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులకు ఉపాధి కల్పించే దేశంలోని ప్రధాన వ్యవసాయ కేంద్రంగా మారిందని తెలిపారు. రైతుబంధు ద్వారా రైతుకు ముందే పెట్టుబడి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని, అదే పెట్టుబడి సాగును పెంచిందని స్పష్టం చేశారు.

సాగు పెరిగితే రైతు నిలబడ్డాడు.. రైతు నిలబడితే కార్మికుడు బతికాడు.. గ్రామ ఆర్థిక వ్యవస్థ బలపడిందని పేర్కొన్నారు. రైతుకు భరోసా ఇచ్చిన నాయకుడే, కార్మికుడికి ఉపాధి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఇది పార్టీ మాట కాదని, ఇది పత్రికలు రాస్తున్న నిజమని వెల్లడించారు.

పొలాల్లో పండుతున్న పంటలు, పనిలో ఉన్న వలస కార్మికులే సాక్ష్యమని స్పష్టం చేశారు. వ్యవసాయం నిలబడితేనే గ్రామం నిలబడుతుందని, గ్రామం నిలబడితేనే రాష్ట్రం నిలబడుతుందని కేసీఆర్ మాటలతో కాదు.. భూమి మీద ఫలితాలతో నిరూపించారని తెలిపారు. 

గొంతునొక్కలేక అరెస్టులు 

వృద్ధురాలిపై కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీ వేధింపులపై ఆగ్రహం

కేఎల్‌ఎస్‌ఆర్ సంస్థపై న్యాయపోరాటం చేస్తున్న వ్యాపారవేత్త సౌరభ్ అగర్వాల్ తల్లి 75 ఏళ్ల వృద్ధురాలిని పోలీసులు అరెస్టు చేయడంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అయిన కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్ఫ్రా ఒక 75 ఏళ్ల వృద్ధురాలిని వేధిస్తోందని, ఆమె గొంతు నొక్కలేక అరెస్టు చేయించారని మండిపడ్డారు. పోలీసులను, ప్రభుత్వ సంస్థలను వాడుకుంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వృద్ధులను వేధించడమే రాహుల్ గాంధీ చెబుతున్న ‘మొహబ్బత్ కీ దుకాన్’ మోడలా..? అని ప్రశ్నించారు.