భగ్గుమంటున్న కాలం
పెరిగిన ముడిచమురు ధరలు బ్యారెల్ 110 డాలర్లు
ప్రపంచవ్యాప్తంగా భయంభయం
అగాధంలోకి రూపాయి విలువ
అంతకంతకూ పతనం..
దేశ ఆర్థిక వ్యవస్థపై భారం
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ-10
న్యూఢిల్లీ, మార్చి ౯: పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఆపరేష న్ ఎపిక్ ఫ్యూరీ- పేరుతో పదిరోజులుగా సాగిస్తున్న యుద్ధం చమురు సంక్షోభాన్ని తెచ్చింది. సోమవారం క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ ఒక్కంటికి 110 డాలర్లు చేరుకుం ది. యుద్ధం మొదలైన తర్వాత చమురు ధరలు ఇప్పటికే 42 శాతం పెరిగాయి. ఇది 120 డాలర్లకు ఎగబాకినా ఆశ్చర్యంలేదని పరిశీలకులు చెబుతున్నారు.
దీంతో మనదేశంలో కొన్ని రసాయనాలు, పేయింట్స్, టైర్లు తదితరాల ధరలు పెరిగే ఆస్కారముంది. మరోవైపు రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చితే 92.35.. కనిష్ఠ స్థానానికి పడిపోయింది. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడనుంది. పెరుగుతున్న చమురు ధరలతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. తన అవసరాల్లో 90 శాతం వరకు ఎల్పీజీని భారత్ దిగుమతి చేసుకుంటుంది. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల సమస్య తలెత్తింది.
క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల వాణిజ్యం కుదేలవ్వడంతో పాటు ద్రవ్యోల్బణం భయాలు పొంచిఉన్నాయి. వంట గ్యాస్ ధరలు పెరిగి సామాన్యుల ఇళ్లలో మంటలు రేగనున్నాయి. గల్ఫ్ నుంచి ఇదేవిధంగా చమురు దిగుమతికి ఆటంకాలు కొనసాగితే, పెట్రోలు, డీజిల్ ధరలు పెరగకుండా ప్రభుత్వం మార్గాంతరాలు అన్వేషించక తప్పదు.
‘భారత వినియోగదారుల ప్రయోజనాలే మాకు ముఖ్యం, ఎప్పుడు కూడా మా ప్రాధా న్యత ఇదే’ అని సోమవారం పార్లమెంట్‌లో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో చిక్కుకోకుండా ఉండేందుకు.. ఇజ్రాయెల్ ఇకపై ఇరాన్ రీఫైనరీ లపై దాడులు ఆపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు.
వంట గ్యాస్ కొరత రానున్నదనే ఊహాగానాల మధ్య ఉత్తరాదిలోని పలు నగరాల్లో అప్పుడే బ్లాక్ మార్కెట్ మొదలైనట్టు వార్తలు వస్తున్నాయి. కొందరు వ్యాపారులు ఒక్కో వంట గ్యాస్ సిలిండర్‌ను ౧,౫౦౦లకు విక్రయిస్తున్నట్టు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. నోయిడా, ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఖాళీ సిలిండర్లు పట్టుకొని జనం బారులుతీరుతున్నారు. దేశంలో ఎల్పీజీ సంక్షోభం ఏమీలేదని ప్రభుత్వం స్పష్టంచేసినా ఉత్తరాదిలో.. కొరత ఏర్పడుతుందేమోనన్న భయం మొదలైంది.




