లబ్ధిదారులకు అండగా ప్రజా ప్రభుత్వం
మంథనిలో కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మరియు పాలకుర్తి మండలాలకు చెందిన పలువురు మహిళా లబ్ధిదారులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం మంథని లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తోందని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి అర్హులైన లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు, తమకు లభించిన ఆర్థిక సహాయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.






