10-02-2026 12:58:45 AM
ఘట్‌కేసర్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ అన్నోజిగూడలోని శ్రీ చైతన్య పాఠశాలలో గురువే కీచకుడిగా మారాడు. తన దగ్గర చదువుకుంటున్న పదో తరగతి బాలికపై కన్నేసి, ప్రేమ పేరుతో వంచించి, రహస్యంగా పెళ్లి చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినప్పటికీ, నిజం ఎక్కువ రోజులు దాగదు కాబట్టి అసలు విషయం బయటపడింది.
అన్నోజిగూడ శ్రీ చైతన్య పాఠశాలలో పర్రే మైటీన్ (27) భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని అతను తన మాటలతో ట్రాప్ చేశాడు. ఈ క్రమంలోనే ఆ బాలికకు మాయమాటలు చెప్పి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న సమయంలో విద్యార్థిని మెడలో పసుపు తాడు (తాళి) ఉండటాన్ని గమనించిన తల్లి దిగ్భ్రాంతికి గురైంది. కూతురిని గట్టిగా నిలదీయగా, తన ఫిజిక్స్ టీచర్ పర్రే మైటీన్ పెళ్లి చేసుకున్నాడని చెప్పింది.
కంగుతిన్న తల్లిదండ్రులు తక్షణమే పాఠశాల ప్రిన్సిపాల్‌ను ఆశ్రయించారు. తల్లిదండ్రుల నిలదీతతో మొదట తనకు ఏమీ తెలియదని ప్రిన్సిపాల్ బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే, సదరు ఉపాధ్యాయుడిని పిలిపించి అడగగా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నానంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.
విషయం బయటకు పొక్కితే పాఠశాల పరువు పోతుందని భావించిన యాజమాన్యం, గోప్యంగా ఉంచుతూనే నిందితుడిని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ‘నమ్మకంతో చదువు కోసం పంపిస్తే, కూతురి జీవితాన్ని నాశనం చేశాడు. ఇటువంటి కీచక గురువులకు కఠిన శిక్ష పడాలి’ అని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.