20 May, 2026 | 1:24 AM

కాళేశ్వరం ఆధ్యాత్మిక వైభవం

20-05-2026 12:00 AM
  1. రేపటి నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు
  2. ప్రారంభించనున్న కంచి కామకోటి పీఠం కాంచీపురం జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి
  3. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో 12 రోజుల పాటు నిర్వహణ

మహబూబాబాద్, మే 19 (విజయక్రాం తి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమ క్షేత్రంలో గురువారం నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 5:43 గంటలకు శ్రీ కంచి కామకోటి పీఠం కాంచీపురం జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ప్రత్యక్ష పోషణలో పవిత్రమైన సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు పుష్కరాలు నిర్వహించనున్నారు.

పుష్కరాల తొలి రోజు నుంచి ద్వాదశి వరకు ప్రతిరోజు ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నారు. పలువురు పీఠాధిపతులు పుష్కరాల్లో భాగంగా భక్తులకు ధార్మిక సందేశాలు ఇవ్వనున్నారు. సరస్వతి నది మహిమను చాటి చెప్పి,  ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ నెల 21న మహాగణపతి హోమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ పుష్కర స్నానం చేయనున్నారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. 

ప్రత్యేక బస్సుల ఏర్పాటు

12 రోజుల పాటు నిర్వహించే పుష్కరాలకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 3,360 బస్సులతో 5,772 ట్రిప్పులు కాళేశ్వరం నడపనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ భాను తెలిపారు. కాళేశ్వరంలో ప్రత్యేకంగా తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటుచేసి అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. అలాగే విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు.

10 వైద్య శిబిరాలతో పాటు, 20 పడకలతో కూడిన రెండు ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.

పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఘాట్ల వద్ద తాగునీరు, వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.  ఆధ్యాత్మిక సందేశాలతో పుష్కరాలు సరస్వతి నదీ మహిమను చాటి చెప్పేలానిర్వహించే ఈ పుష్కరాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించనున్నాయని, 12 రోజులపాటు కాళేశ్వరం భక్తిరసమయంగా మారనుంది.