ముంచుకొచ్చిన ముప్పు
- జిల్లాలో నీటి కోసం అల్లాడుతున్న జనం
- ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారుల విఫలం
- సిండికేట్‌గా మారిన ట్యాంకర్ల యజమానులు
- వాటర్ ట్యాంకర్ కు రూ.వెయ్యి
మేడ్చల్, మే 19 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నీటి సమస్య ముంచుకొచ్చింది. బిందెడు నీళ్ల కోసం ప్రజలు నానా తంటాలు పడాల్సి వస్తోంది. రెండు మున్సిపల్ కార్పొరేషన్ లతో పాటు మూడు మున్సిపాలిటీలలో ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. భూగర్భ జల మట్టం తగ్గిపోవడం, మిషన్ భగీరథ, హైదరాబాద్ వాటర్ వరక్స్ నీరు సరిగా రాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముప్పును పసిగట్టి ముందస్తుగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.
డిసెంబర్, జనవరి నుంచే నీటి కొరత సంకేతాలు వచ్చాయి. ముందస్తుగా చర్యలు తీసుకొని ఉంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఏర్పడేది కాదు. కాంగ్రెస్ పార్టీలో బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న వారే అధికారుల వద్దకు వెళ్లి నీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారంటే జిల్లాలో సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతోంది.
మేడ్చల్ పట్టణంలో వర్షాకాలం నుంచి నీటి సమస్య ఎదురయింది. ఘనపూర్ రిజర్వాయర్ నుంచి మేడ్చల్ వచ్చే నీటిని తగ్గించి హైదరాబాదుకు ఎక్కువగా విడుదల చేశారు. దీంతో పట్టణంలో నీటి కటకట ఏర్పడింది. భూగర్భ జల మట్టం అమాంతం తగ్గిపోవడం వల్ల ఇళ్లలో బోరుబావులు ఎండిపోతున్నాయి. మళ్లీ బోరు వెయ్యాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. అంత ఖర్చు చేసిన నీరు వస్తుందని గ్యారెంటీ లేదు. 1000 అడుగుల లోతు బోర్ వేసిన నీరు రావడం లేదు. దీంతో ప్రజలు ట్యాంకర్ నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది.
జలమండలి అధికారులకు వినతి పత్రాలు..
నీటి సమస్య విషయమై అధికార పార్టీ నాయకులు, ప్రజలు జలమండలి అధికారులకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. తమ ప్రాంతంలో నీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి జలమండలి ఈడి పంకజను కలిసి నియోజకవర్గంలో వివిధ కాలనీలలో ఏర్పడిన నీటి కొరతను పరిష్కరించాలని కోరారు.
చిలుక నగర్, బీరప్ప గడ్డ, వెంకట్ రెడ్డి నగర్, రామంతపూర్, కాప్రా, నాచారం, పద్మశాలి కాలనీలలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోడుప్పల్ ప్రాంతంలో పైపులలో నీరు ప్రెషర్గా రావడం లేదని, ఫలితంగా అనేక కాలనీలకు మీరు సరఫరా కావడంలేదని స్థానికులు జలమండలి ఈడి కి విన్నవించారు. నాలుగైదు రోజులకు ఒకసారి కూడా రావడం లేదని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ట్యాంకర్ యజమానుల సిండికేట్
జిల్లాలో వాటర్ ట్యాంకర్ల యజమానులు ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని ధరలు పెంచేశారు. ఒక్కో ట్యాంకర్ నీరు వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నారు. గృహ యజమానులు రెండు మూడు రోజులకు వెయ్యి రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. అనేకమందికి ఇంటి అద్దెలు జీవనాధారంగా ఉన్నాయి.
ఒక్కో ఇంటిలో రెండు మూడు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. నీటి కొరతతో కిరాయిదారులు ఖాళీ చేస్తున్నారు. అంతేగాక ఉన్నవారికి యజమానులే నీరు సరఫరా చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ ట్యాంకర్లు ప్రజల అవసరాలను తీర్చలేక పోతున్నాయి. దీంతో తప్పనిసరిగా ప్రైవేటు ట్యాంకర్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వాటర్ ట్యాంకర్లు అద్దెకు తీసుకొని సరఫరా చేయాలని కోరుతున్నారు.






