18 April, 2026 | 5:32 PM

రక్త దాతల స్ఫూర్తి అభినందనీయం

18-04-2026 04:09 PM

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు,(విజయక్రాంతి): రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదాతల సేవ స్ఫూర్తి ప్రశంశనియమని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అన్నారు. ములుగు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, టీజీఓ అసోసియేషన్, టీఎన్జీవో యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ములుగు గట్టమ్మ దేవాలయ సమీపంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర  టి.ఎస్.సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ మనం ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుందని, రక్తదానం అనేది కేవలం ఒక కార్యక్రమంగా చూడకూడదని, అది ఒక గొప్ప సామాజిక సంస్కృతిగా మారాలని ఉద్ఘాటించారు.

జీవితాలను కాపాడే మహత్తర సేవలో భాగంగా ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తం అందుబాటులో ఉండడం అత్యవసర చికిత్సలలో ఎంతో కీలకమని, ముఖ్యంగా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య సేవల సమయంలో రక్తదానం ప్రాణదాతగా నిలుస్తుందన్నారు. జిల్లాలోని ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత, పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. అదనపు  కలెక్టర్లు సీ.హెచ్ మహేందర్ జీ, సంపత్ రావులు రక్తదానం చేసి ఉద్యోగులకు, దాతలకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో డీఆర్ డీ ఓ చంద్రశేఖర్, అడిషనల్ డీఆర్డిఓ శ్రీనివాస్, ఉద్యోగ సంఘ ప్రతినిధులు, యువత, వైద్య బృందం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.