calender_icon.png 9 February, 2026 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కోకిల’ గానం .. భాగ్యనగరం

09-02-2026 12:19:53 AM

13న సరోజినీ నాయుడు జయంతి :

వాట్ డు యూ సెల్, ఓ యే మర్చంట్స్?

రిచ్‌లీ యూఆర్ వేర్స్ ఆర్ డిస్‌ప్లేయ్‌డ్

టర్బన్స్ ఆఫ్ క్రిమ్‌సన్ అండ్ సిల్వర్

ట్యూనిక్స్ ఆఫ్ పర్పుల్ బ్రొకేడ్

మిర్రర్స్ విత్ ప్యానెల్స్ ఆఫ్ జేడ్


‘ఓ వర్తకులారా! ఏమిటి మీరు విక్రయిస్తున్నది?

మీ వస్తువులన్నీ ఎంతో ఆడంబరంగా ప్రదర్శిస్తున్నారు!

ఎరుపు, వెండి రంగులు మేళవించిన తలపాగాలా?

ఊదా రంగు మెరుపులున్న జరీ అంగీలా?

అంబరు తాపడం చేసిన అద్దాలా?

లేక పచ్చల పిడి ఉన్న చురకత్తులా?’


వాట్ డు యూ వీవ్, ఓ యే ఫ్లవర్‌గర్ల్స్

విత్ టాస్సెల్స్ ఆఫ్ అజ్యుర్ అండ్ రెడ్

క్రౌన్స్ ఆఫ్ ది బ్రో ఆఫ్ ఏ బ్రైడ్‌గ్రూం

చాప్లెట్స్ టు గార్లండ్ హిస్ బెడ్

సీట్స్ ఆఫ్ వైట్ బ్లోసమ్స్ న్యూగర్‌నెర్డ్

టు పెర్‌ఫ్యూమ్ ది స్లీప్ ఆఫ్ ది డెడ్


‘ఓ పూల కన్యలారా! ఏమిటి

 మీరు అల్లుతున్నది?

ఎరుపు, నీలి రంగుల పూల దండలా?

పెళ్లికొడుకు నుదుటిని అలంకరించే బాసికాలనా?

శోభనపు శయ్యను పరిమళించే పూల మాలలనా?

అప్పుడే కోసిన తెల్లని మల్లె పూల చాదర్లనా?

మరణించిన వారి నిదురను 

సుగంధభరితం చేయడానికా?’  

.....అంటూ భాగ్యనగర వైభవంపై కవితా ధారలు పొంగించారు.... సాహిత్యపరిమళాలద్దారు సరోజినీనాయుడు. ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ (భారత కోకిల)గా పేరున్న ఆమెకు హైదరాబాద్‌తో విడదీయలేని అనుబంధం ఉంది. వాస్తవానికి చెప్పాలంటే ఆమె అచ్చమైన హైదరాబాదీ. ఇక్కడి సంస్కృతిలోని వైవిధ్యం ఆమె ను చిన్ననాడే ఆకట్టుకుంది. అందుకే ఆమె తర్వాత్తర్వాత ఇక్కడి సంస్కృతిని దృశ్యకా వ్యాలుగా మలిచారు.

ముఖ్యం గా ‘ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్’ పేరుతో 1912లో వె లువడిన కవిత ప్రఖ్యాతిగాంచింది. ‘ది బర్డ్ ఆఫ్ టైం’ అనే కవితా సంపుటిలో భాగమైన ఈ కవిత భాగ్యనగర సంస్కృతిని అంతర్జాతీయంగా చా టింది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో స్వదేశీ ఉద్యమ స్ఫూర్తి, భారతీయ హస్తకళల ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు ఈ కవిత రాశారు. కవిత నిజాం కాలం నాటి పాతబస్తీ వైభవాన్ని కళ్లకు కడుతుంది. కవితలోని ప్రతి పదం హైదరాబాద్ పాతబస్తీ పరిమళాలను వెదజల్లుతుంది.

స్థానిక వర్తకులతో సంభాషణలా కవిత సాగుతుంది. ఆ శైలి పాఠకులను మంత్రముగ్ధులను చేస్తుంది. అలాగే ఆమె సాహిత్య ప్రస్థానంలో ‘గోల్డెన్ త్రెషోల్డ్’ మరో మైలురాయి. ఇది ఆమె తొలిరచన. 1905లో ఈ కవితా సంపుటి ప్రచురితమైంది. అది ఎంతటి సంచలనం సృష్టించిందంటే రాత్రికి రాత్రే ఆమె అంతర్జాతీయస్థాయి కవయిత్రిగా అవతరించారు. లండన్‌కు చెందిన సాహితీ విమర్శకులు సైతం ఆమె కవితధారకు మంత్రముగ్ధులయ్యారు.

ఈ పుస్తకం పేరు మీదే హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి ‘గోల్డెన్ త్రెషోల్డ్’ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ భవనం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆధీనంలో ఉంది. ఒకప్పుడు ఈ భవనం దేశ స్వాతంత్య్ర పో రాటానికి, సాహిత్య చర్చలకు వేదిక. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు భవనంలో అతిథులుగా విడిది చేశారు. ఇక్కడ సాగిన మేధోమథనం నుంచే ఎంతో మం ది కవులు అద్భుతమైన కవితలు రాశారు. రాజకీయ ఉద్దం డులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

హైదరాబాద్‌తో అవినాభావ బంధం

సరోజినీనాయుడు 1879 ఫిబ్రవరి ౧౩న హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె విద్యాభ్యాసం, ఎదుగుదల అంతా ఈ నగరంలోనే సాగింది. ఆమె ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ (భారత కోకిల) బిరుదాంకితురాలైనప్పటికీ, భాగ్యనగరవాసులు ఆమె ను ‘హైదరాబాద్ కోకిల’ అని పిలుచుకుంటారు. ఆమె కవిత్వంలో లాడ్ బజార్‌లోని గాజుల సవ్వడి, మీర్ ఆలం మం డిలోని సుగంధ ద్రవ్యాల పరిమళాలు, పత్తర్గట్టి వస్త్ర వ్యాపార వైభవం అడుగడుగునా కనిపిస్తాయి.

బ్రిటిష్ వస్తువులను బహిష్కరించాలనే నాటి స్వదేశీ ఉద్యమానికి దన్నుగా ఆంగ్లంలో ఆమె ఈ కవిత్వం రాశారు. దేశీయ హస్తకళల గొప్పదనాన్ని చాటిచెప్పడానికి ఆమె భాగ్యనగర వీధులను తన కవితా వస్తువులుగా తీసుకున్నారు. దీన్నిబట్టి నగరంపై ఆమెకున్న మమకారం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.

తెలుగు సాహిత్యంపై ప్రభావం

సరోజినీ నాయుడు ఆంగ్లంలో కవిత్వం రాసినప్పటికీ, ఆ కవిత్వంలోని ఆత్మ పూర్తిగా భారతీయ సంస్కృతీ వైభవాలకు సంబంధించింది. ఆమె కవితల్లోని భావుకత, ప్రకృతి వర్ణనలు తెలుగు భావకవులను విశేషంగా ఆకర్షించాయి. దేవులపల్లి కృ ష్ణశాస్త్రి, నాయని సుబ్బారావు, అడవి బాపిరాజు వంటి దిగ్గజ కవులపై ఆమె ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ‘ఇండియన్ వీవర్స్’ కవితలో మానవ జీవితంలోని మూడు దశలను, ఆమె నేతపనితో పోల్చిన తీరు తెలుగు సాహిత్యకారులను ఎంతగానో కదిలించింది. ఉదయాన పసిపాప కోసం నేసే అంగీ నుంచి, రాత్రిళ్లు నేసే శవ వస్త్రం వరకు ఆమె చిత్రించిన కవితలు దృశ్యచిత్రాలుగా నిలిచిపోతాయి.

కవితాత్మక సందేశం

సరోజినీనాయుడు కవితలు కేవలం ఒక పదాల కూర్పు కా దు, అవి వర్ణచిత్రాలని అభిమానులు చెబుతుంటారు. ఆమె కవిత్వంలో పాతబస్తీ అంగళ్ల సందళ్లు, గజ్జెల మోతలు, అత్తరు సుగంధాలుంటాయని కొనియాడుతారు.‘ పూలమ్మే చిన్నారు లు ఒకవైపు పెళ్లి బాసికాలు కడుతూనే, మరోవైపు మరణించిన వారి పాడెపై చల్లే మల్లెలను సిద్ధం చేస్తారు’ అనే కవిత ఒక మ నిషి జీవితంలోని వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. హైదరాబాద్ సంస్కృతిలో నిక్షిప్తమై ఉన్న మానవీయ విలువలను, కళ లను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆమెకే దక్కుతుం ది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆమె ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. తర్వాత సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగారు. ఆమె ఎప్పుడు.. ఏపనిలో నిమగ్న మై ఉన్నా, ఆమెను సాహిత్య ప్రకర్ష మాత్రం వీడలేదు. కవితలు రాస్తూనే ఉన్నారు. 1949 మార్చి 2న లక్నోలో మర ణించారు. ఆమెపై అభిమానంతో హైదరాబాద్‌లో సికింద్రాబా ద్ దగ్గర ఒక వీధికి ‘సరోజినీ దేవి రోడ్డు’ అని నిజాం ప్రభుత్వం నామకరణం చేసింది. ఆమె పేరుపై హైదరాబాద్‌లో సరోజినీ కంటి ఆసుపత్రిని కూడా స్థాపించింది. ఈ అక్షర కోకిల పంచిన కవితా ధారలు ఇప్పటికీ సుగంధాలు చల్లుతూనే ఉన్నాయి. 

 రతన్ రుద్ర