09-02-2026 01:33:13 AM
ప్రతి ఎన్నికలప్పుడు ఇదే తంతు
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి) : దేశవ్యాప్తంగా ఏవైనా సరే మంచి చేసే నాయకులను ఎన్నుకోవాలనుకునే రోజుల నుంచి ప్రస్తుతం ఎవరు ఎక్కువ డబ్బు పంచితే వారికే ఓటు వేసి గెలిపించే దుస్థితికి ఎన్నికలు దిగజారిపోయాయి. ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితులు, పోటీని బట్టి ఓటుకు రేటును నిర్ణయిస్తున్నారు. రూ. 500 నుంచి రూ.10వేల వరకు వెచ్చించేందుకు కూడా వెనుకాడని పరిస్థితులున్నాయి. అయితే, ఎన్నికల్లో ఓటర్లను ఏ రకంగానూ ప్రలోభపెట్టడం విరుద్ధమని చట్టాలు చెబుతున్నాయి.
ఈ చట్టాలను అమలు చేసేందుకు స్వయం ప్రతిపత్తి అధికారంతో ఎన్నికల సంఘం పనిచేస్తుంది. అయినప్పుటికీ ఎన్నికల్లో ప్రలోభాలు మాత్రం ఆగడం లేదు. ఓటర్లకు డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పంచడం సర్వసాధారణమై పోయింది. దేశంలో ఎక్కడైనా ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే తనిఖీలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, వీడియో సర్వైలెన్స్ బృందాలు రంగంలోకి దిగుతున్నా... ఓటర్లను ప్రలోభ పెట్టే డబ్బు ప్రవాహానికి మాత్రం అడ్డుకట్ట పడ డం లేదు.
ఓటుకు వేల రూపాయలు పంచుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా అధికారికంగా పట్టుబడుతున్నది మాత్రం దాని తక్కువ శాతమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటర్ల ఇళ్లలోకి డబ్బు, మద్యం, వస్తువులు అండర్‌గ్రౌండ్ మార్గాల్లో నిరాటంకంగా చేరుతున్నాయన్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. అధికారిక లెక్కలకూ, గ్రౌండ్ రియాలిటీకి మధ్య వ్యత్యాసమే ఇప్పుడు ఎన్నికల పర్యవేక్షణ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
పోటీని బట్టి ఓటుకు రేటు!
ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు పంచడం సహజమే అయినా బహిరంగంగా మాత్రం ఎవరూ ఒప్పుకోరు. కానీ రాజకీయ వర్గాలు, గ్రౌండ్ రిపోర్టుల ప్రకారం ఏ పార్టీ, ఏ అభ్యర్థి ఎంత పంచుతున్నారనేది విస్తృతంగా ప్రచారం జరు గుతూనే ఉంటుంది. ఈ విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. గ్రామీణ నియోజకవర్గాల్లో పోటీ బట్టి ఒక్కో ఓటుకు రూ. 3,000 నుంచి రూ.5,000 వరకు, పట్టణ ప్రాంతాల్లో ఓటుకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు పంచేందుకు కూడా అభ్యర్థులు వెనుకాడరు.
ఇంకా ఉప ఎన్నికల్లో సందర్భంలో అయితే పరిస్థితి ఇందుకు పూర్థి భిన్నంగా ఉంటుంది. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు ఎంత ఖర్చు చేసేందుకైనా ముందుకొస్తారు. ఈ లెక్కన 2 లక్షల ఓటర్లు ఉన్న ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో ఓటుకు సగటున రూ. 5,000 అనుకున్నా మొత్తం రూ.100 కోట్లు ఖర్చు అవుతాయి. అదే మొత్తం 119 నియోజకవర్గాల్లో అయితే అసలు పంపిణీ అయ్యే డబ్బు విలువ వేల కోట్లలోనే ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ డబ్బు మొత్తం నగదు రూపంలోనే కాకుండా వస్తువుల రూ పంలోనూ ప్రలోభ పెడుతుంటారు. ము ఖ్యంగా మద్యం బాటిళ్లు, చికెన్ / మటన్ బిర్యానీ ప్యాకెట్లు, బట్టలు, చీరలు, మొబైల్ ఫోన్లు, గిఫ్ట్ హ్యాంపర్లు వంటివి నగదు లెక్క ల్లో కనిపించవు, కానీ ఓటు ప్రభావం మా త్రం భారీగా ఉంటుంది. ఓటర్లకు పంచే డ బ్బును కూడా ఒకేసారి కాకుండా చిన్న చిన్న మొత్తాలుగా, అనేక మధ్యవర్తుల ద్వారా పం పిణీ చేస్తారు. ముఖ్యంగా బైకులు, ఆటోలు, ప్రైవేట్ కార్లలో నగదును తరలిస్తారు.
మరి తనిఖీల్లో..?
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆయా అభ్యర్థులు డబ్బును పంచుతారని పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ ఎన్నికల సంఘం తనిఖీల్లో పట్టుబడుతున్న నగదు వివరాలు చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తున్నాయి. వాస్తవానికి స్థానిక పరిస్థితులను బట్టి తెలంగాణలో అయితే ఆయా నియోజకవర్గాల్లో రూ.50కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎన్నికకు సంబంధించి సుమారు రూ.5వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్లకు పైగానే అభ్యర్థుల ఖర్చు చేస్తున్నారు.
కానీ అధికారికంగా ఎన్నికల సంఘం సీజ్ చేసే నగదు మాత్రం ఆ స్థా యిలో ఉండటం లేదు. తెలంగాణ జరిగిన గత ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం సీజ్ చేసిన ప్రలోభాల వివరాలు గమినిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రూ.103 కోట్లు, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రూ.50కోట్లు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రూ.సుమారు రూ.700 కోట్లు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రూ.200 కోట్లు, 2025 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రూ.34 కోట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ వివరాలను గమనిస్తే ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చు.. ఎన్నికల సంఘం సీజ్ చేసే మొత్తం మధ్య భారీ వ్య త్యాసం స్పష్టంగా తెలుస్తోంది.
వేల కోట్ల రూపాయలు పంచుతున్నాయనే ఆరోపణ లు ఉన్నప్పటికీ పట్టుబడేది మాత్రం వందల కోట్లకే ఎందుకు పరిమితం అవుతుండటంపై తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘం సీజ్ చేస్తున్న లెక్క లు పొంతన లేకుండా ఉన్నాయని, ప్రతి నియోజకవర్గంలో డబ్బు పంపిణీపై ఆరోపణలు ఉన్నా కేసులు ఎందుకు నమోదు కావ డం లేదు.. శిక్షలు ఎందుకు పడటం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం లెక్కలు గ్రౌండ్ రియాలిటీకి పొంతన లేవన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
తనిఖీల్లో ఎందుకు చిక్కడం లేదు..
ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ తనిఖీలు చేపడుతున్నా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఆపలేకపోతుంది. అ యితే ప్రతి ఎన్నికల సందర్భంగా ఈ తంతు సర్వసాధారణం కావడంతో దీనిలోని లోపాలను ఎన్నికల అధికారులు సైతం ఒప్పుకోక తప్పడం లేదు. ఫ్లయింగ్ స్క్వాడ్లకు ముం దస్తు సమాచారం ఉండకపోవడం, పంపిణీ చేసే వారిపై రాజకీయ ఒత్తిళ్లు, లోకల్ స్థాయి ఒప్పందాలు వంటివి కీలకంగా వ్యవహరిస్తున్నాయి.
ముఖ్యంగా కేసులు నమోదు అయి నా సాక్ష్యాలు లేకుండా బలహీనమవుతున్నాయి. చాలా కేసులు ‘సందేహాస్పద నగ దు’గా మిగిలిపోతున్నాయి. ఫలితంగా డబ్బు పట్టుబడుతుంది... కానీ నేరం నిరూపితం కావడం లేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం--1951, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు వంటివి అన్ని ఉన్నా ఎంతమంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయ్యారు, ఎంతమందికి జైలు శిక్ష పడిందనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
దీనికి సమాధానం స్పష్టంగా కనిపించడం లేదు. వాస్తవానికి రాజకీయ నిధుల పారదర్శకత లేకపోవడం, ఖర్చుల లెక్కలు కాగితాలకే పరిమితం కావ డం, ఎన్నికల యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ లేకపోవడం, ఓటు కూడా ‘లావాదేవీ’గా మారిపోవడమే ఈ లోపానికి బలమైన కారణంగా కనిపిస్తుంది.
ఎన్నికల సంఘం పర్యవేక్షణ, పారదర్శకతపై ప్రశ్నలు..
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని బహిర్గతమైనప్పటికీ దానికి అడ్డుకట్ట వేయలేకపోవ డంతో ఎన్నికల సంఘం పర్యవేక్షణ, పారదర్శకతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల ఖర్చుల లెక్కలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్లకు నిజమైన స్వేచ్ఛ ఉందా?, రాజకీయ నిధులపై పారదర్శకత ఎందుకు లేదనే అనుమా నాలు కలుగుతున్నాయి.
ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేకపోవడమే డబ్బు రాజకీయాలను మరింత బలపరుస్తున్నాయన్న ఆరోపణలు తెరపైకి తెస్తోంది. మొత్తంగా అభ్యర్థులకు పరిమితులు లేకపోవడం, ఎన్నికల సంఘం పర్యవేక్షణ లోపం కారణంగా ఓటు హక్కు విలువ పడిపోవడంతోపాటు డబ్బు లేకుండా ఎన్నికలు సాధ్యం కాని వ్యవస్థగా ప్రజాస్వామ్యం మా రిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వేల కోట్ల ప్రలోభాల మధ్య.. పట్టుబడేది వందల కోట్లే కావడంతో లోపం డబ్బులో కాదు, పర్యవేక్షణ వ్యవస్థలోనే ఉందన్న విమర్శలు తెలం గాణలో మరింత బలపడుతున్నాయి.