09-02-2026 01:25:25 AM
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ‘ఎన్ని అడ్డంకులు ఎదురైనా అభివృద్ధి, ప్రజా సంక్షేమమే అజెండాగా పెట్టుకుని ముందుకు పోతున్నాం.. విపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా.. వాటికి పైఎత్తులు వేసి మున్సిపల్ ఎన్నికల్లో చిత్తు చేయాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. విపక్షాలు ప్రభు త్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నా యని.. విపక్ష దాడులను సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సూచించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో కొడవటంచ దేవాలయ పునరుద్ధరణ పనులను ప్రారంభిం చిన అనంతరం గణపురం మండలం, చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. పాత జిల్లాల రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచన మాత్రమే ఉందని తెలిపారు.
బహిరంగంగా ప్రజల సూచనలు తీసుకునే ఆలోచన చేస్తామని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు కాదని పునరుద్ఘాటించారు. విపక్షాల కుట్రలు, కుతంత్రాలను నమ్మొద్దంటూ ప్రజలకు సీఎం రేవంత్ సూచించారు. రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదంటూ ఆ పార్టీ నేతలను హెచ్చరించారు.
సింగరేణి కార్మికులకు నష్టం కలిగించం..
సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయమూ ప్రభుత్వం తీసుకోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సింగరేణి కార్మికు లకు సంబంధించిన మెడికల్ అన్ ఫిట్ బోర్డును రద్దు చేస్తామని, సింగరేణి వారసత్వ ఉద్యోగాలపైన కొందరు విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మెడికల్ బోర్డు పైన విషప్రచారం చేసే వారిని మోకాళ్లపైన కూర్చొబెట్టాలని, కార్మికులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ప్రభుత్వం సింగరేణి కార్మికులది, వారికి నష్టం కల్గించే ఏ పనిచేయమని, 217 డిస్మిస్ కార్మికుల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామన్నారు.
కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నది బీజేపీ కాదా?
తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు.. తనను ఏ పేరుతో పిలిచినా ఫర్వాలేదన్నారు. కానీ మీ పక్కనే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మాత్రం కిషన్ రావు అంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నది బీజేపీ కాదా? అంటూ ఆ పార్టీ నేతలను సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా? అంటూ బీజేపీ అగ్రనేతలకు సీఎం రేవంత్ గుర్తుచేశారు.
మరీ బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేసీఆర్, హరీశ్, కేటీఆర్ అరెస్టు కాకుండా ఎవరు అడ్డుపడుతున్నారంటూ సందేహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని గుర్తు చేశారు. మరి ఆ కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదంటూ సీఎం రేవంత్.. బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. కేసీఆర్‌ను అరెస్టు చేసే వరకు కిషన్‌రెడ్డిని కిషన్‌రావే అని పిలుస్తారంటూ సీఎం రేవంత్ కుండబద్దలు కొట్టారు.
కేసీఆర్‌కు కేటీఆర్ దొంగపుత్రుడైతే.. కిషన్‌రెడ్డి దత్తపుత్రుడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఫోన్ ట్యాపింగ్‌తో రూ.వేల కోట్లు సంపాదించారంటూ బీఆర్‌ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బిల్డర్లు, రియల్టర్లను బెదిరించి.. ఎలక్టోరల్ బాండ్లు తీసుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ అంటే.. బ్లాక్‌మెయిల్ రాజకీయ సమితి అంటూ సీఎం రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. ఇవాల్టి నుంచి ఆ పేరుతోనే పిలుస్తామని సీఎం స్పష్టం చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పార్లమెంటు సభ్యులు డాక్టర్ కడియం కావ్య, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, 20 సూత్రాల అమలు చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, సింగరేణి కార్మిక సంఘం చైర్మన్ జనక్ ప్రసాద్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రియాజ్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీలకు 17,442కోట్లు..
విపక్షాలు బీఆర్‌ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే అర్హత లేనే లేదని సీఎం అన్నారు. . కేసీఆర్, మోదీని చూసి ఓటు వేస్తే మోసపోతామంటూ భూపాలపల్లి జిల్లా ప్రజలకు సూచించారు. అధికారంలో ఉన్న మమ్మల్ని చూసి ఓటు వేయండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీల్లో పనులు చేసేది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులేనని పేర్కొన్నారు. తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 17,442 కోట్లు మంజూరు చేశామని, రూ.6,116 కోట్లతో వరంగల్ అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు చేపడతామని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో కల్వకుంట్ల కుటుంబానికే పదవులు వచ్చాయని విమర్శించారు.
పేదల ఆత్మగౌరవాన్ని బీఆర్‌ఎస్ పట్టించుకోలే..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటల గారడీతోనే పాలన సాగించిందని, ప్రజల ఆత్మగౌరవాన్ని పట్టించుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. వైఎస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించారని, అప్పటి ఇండ్లే తప్ప డబల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని గత పాలకులు మాయ మాటలు చెప్పారన్నారు. గత పాలకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్‌రావులు వందల ఎకరాల్లో ఎర్రవల్లి, జన్వాడలో తదితర ప్రాంతాల్లో ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారని విమర్శించారు.
టీవీలు, పేపర్లు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు కేసీఆర్ కుటుంబానికి వచ్చాయి, కాని పేదలకు డబల్ బెడ్రూం ఇళ్లు రాలేదని విమర్శించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, 22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు సీఎం వివరించారు. వచ్చే బడ్జెట్ లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, పేదల ఆత్మగౌరవం పెరిగేలా , ఆడబిడ్డలు ఆశ్వీరదించేలా ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత మంజూరు చేస్తామన్నారు. దేశరాజకీయాల్లో పీవీ, శ్రీపాదరావు పాత్ర ఎనలేనిది ముఖ్యమంత్రి కొనియాడారు.
భూపాలపల్లికి నీళ్లు కూడా ఇవ్వలేదు : మంత్రి శ్రీధర్‌బాబు
భూపాలపల్లి ప్రాంతంలోని గోదా వరి జలాలను బీఆర్‌ఎస్ నాయకులు ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నించారే తప్పా ఈ ప్రాంతానికి చెందిన ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని, ఈ ప్రాంతం అభివృ ద్ధిపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం వివక్ష చూపిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతోం దని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూపాలపల్లి పట్టణంతోపాటు భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో రూ.200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలతో పాటు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత ఘనంగా నిర్వహించామని, ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేసినట్లు చెప్పారు.
భూపాలపల్లి ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించేందుకు గోదావరి జలాలను అందించేందుకు డీబీఎం 38 పూర్తి చేయడంతో పాటు భీమ్ ఘన్‌పూర్‌ర్, ఘన్‌పూర్, జుక్కల్ గొర్లవీడు ఇందిరా సాగర్ ప్రాజెక్టుల సిమెంట్ లైనింగ్ పనులకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చడానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కోల్ ఇండియా అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి తమ నిర్ణయం తీసుకుంటామన్నారు.
పేరు మార్పిడి, మెడికల్ అన్ఫిట్ తదితర అంశాలపై అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, సింగరేణి కార్మికుల సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, కార్మికుల కోరికల కనుగుణంగా ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని హామీ ఇచ్చారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి చేయూతను అందించాలని మంత్రి పిలుపునిచ్చారు.