3 April, 2026 | 3:14 AM

బెంగాల్‌లో ‘సర్’ రగడ

03-04-2026 01:15 AM

9 గంటల పాటు విచారణ అధికారుల నిర్బంధం

మాల్దా ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఇది మా ఆదేశాల ధిక్కార దుస్సాహసమే..

సమగ్ర దర్యాప్తునకు ఎన్‌ఐఏ లేదా సీబీఐని నియమించాలని ఈసీని ఆదేశించిన ఎస్‌సీ

నా చేతుల్లో ఏమీ లేదన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

మాల్దా ఘటన బీజేపీ కుట్రలో భాగమే.. 

ఆ పార్టీ.. రాష్ట్రపతి పాలనకు యత్నిస్తోంది 

ఎన్నికల అధికారులు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మాట వింటున్నారన్న దీదీ

కోల్‌కతా, ఏప్రిల్2: పశ్చిమబెంగాల్‌లో బుధవారం మాల్దాలోని కలియాచక్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ వెలుపల భారీ నిరసన చెలరేగి, తమ సూచనలను తిరిస్కరించా రన్న నెపంతో ‘సర్’ విధుల్లో ఉన్న జ్యుడీషియల్ అధికారులను దాదాపు 9 గంటల పాటు ఆందోళనకారులు నిర్బంధించడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ ఘటనపై గురువారం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..

సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ఎన్‌ఐఏ లేదా సీబీఐని నియమించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించిన తర్వాత, సీఎం మమతా బెనర్జీ గురువారం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటన బీజేపీ ‘వ్యూహంలో’ భాగమని ఆరోపించింది. బెంగాల్ ఎన్నికలను రద్దు చేయించి, రాష్ట్రపతి పాలన విధించాలని కాషాయ పార్టీ కోరుకుంటోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సాగర్‌దిఘిలో గురువారం జరిగిన ఒక బహిరంగ సభలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ, మాల్దా ఘటనతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశా రు. ‘దీనికి బాధ్యులు ఎవరో నాకు తెలియదు. దీని గురించి నాకు ఎవరూ సమాచా రం ఇవ్వలేదు. పరిపాలన నా చేతుల్లో లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎన్నికల సం ఘం నియంత్రిస్తుంది.

వారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాట వింటున్నారు. అధికారులందరినీ మార్చేశారు’ అని అన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సమగ్ర సర్వే(ఎస్‌ఐఆర్)పై ప్రజలు కోపంగా ఉన్నారని మమత వ్యాఖ్యానించారు. మాల్దాలో జరిగిన ఘటన బీజేపీ కుట్రలో భాగమని ఆరోపించారు. వారిని ఓటమి భయం వెం టాడుతుందన్నారు. అందుకే.. అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయించి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కాషాయ పార్టీ భావిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘంపైనా ఆమె విరుచుకుపడ్డారు.

వారు శాంతిభద్రతలను నియంత్రించాలని చూస్తున్నారు కానీ విఫలమయ్యారు. న్యాయాధికా రులకు రక్షణ కల్పించడంలో వారు విఫలం చెందారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున, న్యాయాధికారులకు భద్రత కల్పించడం ఈసీ బాధ్యత అని తృణమూల్ కాంగ్రెస్ వాదించింది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు లక్షలాది మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడంపై చెలరేగిన తీవ్ర అశాంతి నేపథ్యంలో, బెంగాల్ ప్రజలు ‘ప్రలోభాలకు లొంగవద్దని’ బెనర్జీ శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

మాల్దాలో ఏం జరిగింది?

ఎస్‌ఐఆర్ సందర్భంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ, బుధవారం మాల్దాలోని కలియాచక్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ వెలుపల భారీ నిరసన చెలరేగింది. ఓటర్ల పేర్లను జాబితాలో ఉంచాలా లేదా తొలగించాలా అని నిర్ణయించడానికి, ‘విచారణలో ఉన్న’ కేసులను సమీక్షిస్తున్న న్యాయాధికారులతో సమావేశం కావాలని నిరసనకారులు కోరారు.

వారి అభ్యర్థనను తిరస్కరించడంతో, సా యంత్రం మూకుమ్మడిగా కార్యాలయాన్ని చుట్టుముట్టి, ముగ్గురు మహిళలతో సహా ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించారు. సుమారు తొమ్మిది గంటల తర్వాత, తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో పోలీసులు ఆ అధికారులను రక్షించారు. ఖాళీ చేయిస్తున్న సమయంలో నిరసనకారులు పోలీసు వ్యాన్‌పై రాళ్లు కూడా విసిరారు.

బెంగాల్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

గురువారం ఈ విషయాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ ఘటన తమ అధికారాన్ని సవాలు చేసే ప్రయత్నమని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌పై ‘అత్యంత ధ్రువణ రాష్ట్రం’గా అభివర్ణిస్తూ, ఈ ఘటన ముందస్తు ప్రణాళికతో, ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు కనిపిస్తోందని కోర్టు పేర్కొంది.

‘ఈ ఘటన న్యాయాధికారులను బెదిరించడానికే కాకుండా, ఈ కోర్టు అధికారాన్ని సవాలు చేయడానికి కూడా చేసిన దుస్సాహసం’ అని ఉత్తర్వులో పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ఎన్‌ఐఏ లేదా సీబీఐని నియమించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.