23 April, 2026 | 2:58 AM

ఆగిన ఆర్టీసీ చక్రం

23-04-2026 01:33 AM

స్తంభించిన ప్రజా రవాణా

డిపోల్లోనే బస్సులు.. ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు 

పోలీసుల సాయంతో బస్సులు నడిపేందుకు ప్రయత్నించిన అధికారులు.. అడ్డుకున్న కార్మికులు 

  1. పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం 
  2. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించిన ప్రజలు 
  3. చర్చల మధ్యలో వెళ్లిపోయింది అధికారుల కమిటీయే
  4. నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో మహాధర్నా: ఆర్టీసీ జేఏసీ

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఆర్టీసీ రథచక్రం ఆగింది.. లక్షలా ది మంది ప్రయాణికులను తమ గమ్యానికి చేరవేసే సామాన్యుని వాహనం నిలి చింది.. ప్రజా రవాణా ఎక్కడికక్కడ స్తం భించిపోయింది. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మె తొలి రోజు విజయవంతమైంది. కార్మికులంతా సమ్మెలో పాల్గొనడం తో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు రోడ్డెక్కలేదు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కొన్ని చోట్ల డిపోల నుంచి బస్సు లు బయటకి రాకుండా వాటికి అడ్డంగా కార్మికులు బైఠాయించారు. ఉదయం నుంచే ప్రయాణికులు బస్సుల కోసం బస్టాండ్‌లలో పడిగాపులు కాసారు. నడిచిన అరకొర బస్సులు కూడా ప్రయాణి కులతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నగరంతో పాటు పలు డిపోల్లో అక్కడక్కడ అద్దె బస్సులను నడిపేందుకు అధికా రులు ప్రయత్నించినా అవి ఎటూ సరిపోలేదు. ఈ బస్సులను ప్రైవేట్ సిబ్బందిని పెట్టి నడిపారు.

అద్దె బస్సుల్లో కండక్టర్లు లేకుండా తిప్పడంతో పురుషులు సైతం టికెట్లు తీసుకోకుండానే ప్రయాణించారు. మరోవైపు అందుబాటులో బస్సుల్లేకపోవడంతో ఆటోలు, క్యాబ్‌లు, ప్రైవేట్ వాహనాలను ప్రయాణికులు ఆశ్రయించారు. ఇదే అదునుగా జనాల నుంచి అధిక ఛార్జీలను ప్రైవేట్ వాహనదారులు వసూలు చేశారు.

ఇలావుండగా, తమను ఎవరో రెచ్చగొడితే సమ్మె చేయడానికి తాము చిన్న పిల్లలం కాదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న పేర్కొన్నారు. సమ్మెకు కారణం మంత్రి పొన్నం ప్రభాకరే అన్నారు. ప్రతిపక్ష నేతలను తాము కలవలేదని, అయితే అన్ని పార్టీల మద్దతును కూడగడుతామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని అమర వీరుల స్థూపం వద్ద ఆర్టీసీ జేసీ నేతలు నివాళులర్పించారు. 

నిలిచిపోయిన రవాణా వ్యవస్థ..

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల బస్సుల్లో లక్షలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంగళవారం ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు ఫలించకపోవడంతో ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బుధవారం తెల్లవారుజాము నుంచే కార్మికులు విధులను బహిష్కరించారు. తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజా రవాణా నిలిచిపోయింది. హైదరాబాద్ నగరంలోని ప్రధాన డిపోలైన ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, ఎల్బీనగర్ సహా ఇతర డిపోల్లో బస్సులు కదలలేదు.

నిత్యం ప్రయాణించే 26 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసులు కిక్కిరిసిపోయాయి. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ప్రైవేట్ వాహనాలు, క్యాబ్‌లను ఆశ్రయిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. పలుచోట్ల పోలీసుల బందోబస్తు మధ్య బస్సులను అధికారులు నడిపారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె జరుగుతుండటంతో 3 వేల బస్సులకు గానూ బుధవారం ఉదయం నుంచే 1,000 బస్సులను హైదరాబాద్ నగరంలో ప్రత్యామ్నాయంగా సిద్ధంచేశారు.

పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద నడిచే 480 ఎలక్ట్రిక్ బస్సులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో డ్రైవర్లు ఉన్నప్పటికీ, కండక్టర్ల కొరత వేధించింది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెబాట కామారెడ్డి డిపోలో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల సహాయంతో బస్సులు నడపడాన్ని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో సీఐ నరహరితో పాటు పోలీసు సిబ్బంది, కార్మికుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఆర్డీవో వచ్చి నచ్చచెప్పినా కార్మికులు వినలేదు. పోలీసుల తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోచోట పోలీసుల అధికారి ఆర్టీసీ కార్మికునిపై చేయిచేసుకున్న ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి డిపోలోనూ బలవంతంగా బస్సులను నడిపేందుకు పోలీసులు యత్నించడంతో పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఓ బస్సు టైర్ వాల్వ్‌ను కార్మికులు విరగొట్టి ఆ బస్సును అడ్డుకున్నారు. హుస్నాబాద్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులతో కలిసి అఖిలపక్ష నాయకులు వారికి మద్దతుగా నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో కార్మికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

కరీంనగర్‌లో ఆ డిపోకు చెందిన బస్సు వరంగల్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. డ్రైవర్ టిమ్ మిషన్ ద్వారా టిక్కెట్లు ఇస్తూ డ్రైవింగ్ చేస్తుండగా అదుపుతప్పిన బస్సు లారీని ఢీ కొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగుగురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరైనా శిక్షణలేని ప్రైవేట్ సిబ్బందితో అద్దె బస్సులను నడుపుతూ ఇలా ఇబ్బందులను గురిచేయడం సరికాదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, సిద్ధిపేట, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్ బస్ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. వరంగల్ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల్లో మొత్తం వెయ్యికిపైగా ఆర్టీసీ, అద్దె బస్సులు ముందుకు కదల్లేదు.రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. రెగ్యులర్ సిబ్బందితోపాటు ఔట్‌సోర్సింగ్ కార్మికులు సైతం సమ్మెలో పాల్గొన్నారు. 

ప్రైవేట్ సిబ్బందితో విధులు..

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు సమ్మెను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేట్ అద్దె బస్సులను వీలైనంత వరకు రోడెక్కించాలని చూస్తున్నారు.  రిటైర్డ్ డ్రైవర్లు, భారీ వాహన లైసెన్స్ ఉన్న వారిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునేందుకు చర్యలు చేపట్టారు. పల్లె వెలుగు బస్సులు నడవకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు ‘మహాలక్ష్మి’ పథకం కింద ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు, ఇప్పుడు ప్రైవేట్ వాహనాలకు రెండు మూడు రెట్లు ఛార్జీలను చెల్లించాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె తీవ్రతను బట్టి మరిన్ని ప్రైవేట్ వాహనాలను స్టేజ్ క్యారేజీలుగా నడిపేందుకు అధికారులు అనుమతించే అవకాశం ఉంది. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, మెట్రో లేదా ఎంఎంటీఎస్ సేవలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆర్టీసీకి నష్టమే..

ఆర్టీసీ బస్సులు ఆగిపోవడంతో ఆర్టీసీ ఆదాయానికి గండిపడినట్లే. సంస్థ ఆదాయం కోల్పోనుంది. ప్రతి నెలా ఆర్టీసీకి దాదాపు రూ.700 కోట్ల ఆదాయం వస్తోంది. ఈలెక్కన రోజుకు సుమారుగా రూ.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లే. ఇప్పటికే మహాలక్ష్మి కారణంగా ప్రభుత్వం ఏ నెలకు ఆ నెలా నిధులు చెల్లించకపోవడంతో ఆదాయం పడిపోయింది. ఇప్పుడు సమ్మె ప్రభావం పడడంతో మరింత ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అసలే ఇప్పుడు పెళ్లిల సీజన్ ఉండడంతో ప్రజలు ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. ఈరకంగానూ ఆర్టీసీ ఆదాయంపై ఎఫెక్ట్ పడనుంది.

చర్చల మధ్యలో వెళ్లిపోయింది అధికారుల కమిటీయే 

ఐఏఎస్ అధికారుల కమిటీయే సమ్మె చేసుకోండని చర్చల మధ్యలోంచి వెళ్లిపోయారని.. గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద మీడియాతో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న చెప్పారు. చర్చలు జరుగుతుండగా కమిటీయే వెళ్లిపోయిందన్నారు. తామే మధ్యలోంచి వెళ్లిపోయామనే వ్యాఖ్యలు అబద్ధమన్నారు. అన్ని వర్గాల నుంచి తమకు మద్దతు వస్తుందని, ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు. 2019లో చేపట్టిన సమ్మెలో 36 మంది ఆర్టీసీ కార్మికులు బలిదానం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు మరోసారి సమ్మె చేపడుతున్న నేపథ్యంలో వారందరికీ నివాళులర్పిస్తూనే, అమరవీరుల సాక్షిగా ప్రతినబూని తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకూ సమ్మెను కొనసాగిస్తామన్నారు. ఈనెల 23 ఉదయం 5 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, వర్క్‌షాపుల్లో మహాధర్నాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ ఒక్క డిమాండ్‌పై అనుకూలమైన నిర్ణయం తీసుకోని కమిటీని ప్రభుత్వం వేసి సమ్మెను విరమించాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేసిందన్నారు.

ఈ సమస్యలు కొత్తవి కావని, గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం దృష్టిలో ఉన్నవేనన్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించే అవకాశముందని, దీనికి కమిటీ వేయాల్సిన అవసరమేలేదన్నారు. నాలుగు వారాల గడువెందుకు అని ఆయన ప్రశ్నించారు. అధికారులతో జరిగిన చర్చల్లో మంత్రులెవరూ లేరని, ఐఏఎస్ అధికారుల కమిటీ చేతులెత్తేసి వెళ్లిపోయారన్నారు. 

జేఏసీ వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. మాటలతో, కమిటీ కాలయాపనతో కాకుండా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కమిటీ వేయడం ఎందుకని ప్రశ్నించారు. ఏపీ తరహాలోనే ఇక్కడ కూడా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ఆర్టీసీకు తప్ప మిగతా శాఖల్లో యూనియన్లు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా జీతభత్యాలివ్వాలని అన్నారు.

ఆర్టీసీ బతకాలంటే సమ్మె చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. అన్ని వర్గాలు తమకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. ఇది తమ ఆత్మగౌరవ పోరాటమన్నారు. 37 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారని, తమతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని సీఎం, మంత్రిని ఆయన కోరారు. మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్టీసీ జేఏసీకు మద్దతు తెలుపుతూ రాష్ట్ర సాధన, సకల జనుల సమ్మెలో ముందుండి పోరాటం చేసిన ఆర్టీసీ కార్మికులను భయపెట్టి లొంగదీసుకోవడం ఎవరీ తరం కాదన్నారు.

ప్రజలు కూడా ఆలోచన చేయాలని, ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఇది ప్రజల సమస్య అన్నారు. చత్తీస్‌ఘడ్, బీహార్ నుంచి సిబ్బందిని తెప్పించి నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వలో విలీనంపై గవర్నర్ ఆమోదం కూడా ఇప్పటికే తెలిపారన్నారు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలపాలని, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.