ప్రజల భావోద్వేగాలతో ఆటలాడొద్దు
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కుషాయిగూడ, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్‌నారపల్లి ఎలివేటెడ్ కారిడార్కు దివంగత నేత బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై జరుగుతున్న వివాదం రాజకీయాలకు బలి కాకూడదని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఇది కేవలం పేరు విషయం కాదని, ప్రజల భావోద్వేగాలతో జరుగుతున్న రాజకీయ ఆటగా అభివర్ణించారు. శుక్రవారం కాప్రా పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాజిరెడ్డి సేవలకు గుర్తింపుగా ఆయన పేరును పెట్టడం సముచితమని పేర్కొన్నారు. ఆయన మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ప్రజల కోసం చేసిన సేవలను గుర్తుచేశారు. నియోజకవర్గంలో రూ.150 కోట్ల సీఆర్‌ఎంపీ నిధులతో రహదారుల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మంత్రి సహకారంతో పనులకు అనుమతులు పొందినట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామా రావు బిఆర్‌ఎస్ నేతలు బైరి నవీన్ గౌడ్ నే నే మురీ మహేష్ గౌడ్ దిల్ బట్ సీనియర్ నాయకుడు ఇంద్రయ్య కృష్ణ గౌడ్ కాలనీ నాయకులు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




