4 March, 2026 | 8:47 AM

వేములవాడలో వీధికుక్కల వీరంగం

04-03-2026 12:00 AM

బాధితులకు అండగా  22వ వార్డు కౌన్సిలర్ : ఇప్పపూల మమత - అజయ్

వేములవాడ,మార్చి 3,(విజయక్రాంతి)రాజన్నసిరిసిల్ల జిల్లా,వేములవాడ పట్టణం లో వీధి కుక్కల సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు వివిధ ప్రాంతాల్లో కుక్కలు దాడి చేయడంతో సుమారు 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటనలతో పట్టణ ప్రజల్లో ఆందోళన నెలకొంది.22వ వార్డు పరిధిలోని బద్ది పోచమ్మ వీధి, అర్బన్ కాలనీ, సుభాష్ నగర్, ధోబీఘాట్, మార్కెట్ ప్రాంతాల్లో కుక్కల గుంపులు సంచరిస్తూ పాదచారులు, చిన్నారులు, వృద్ధులపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.

కస్మికంగా దాడి చేయడంతో పలువురు గాయపడి చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించబడ్డారు.విషయం తెలిసిన వెంటనే 22వ వార్డు కౌన్సిలర్ ఇప్పపూల  మమత - అజయ్ ఘటనాస్థలాలకు చేరుకొని బాధితులను పరామర్శించారు.గాయపడిన వారిని స్వయంగా ఆటోలో ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. అవసరమైన ఇంజెక్షన్లు, మందు లు అందేలా వైద్యులతో మాట్లాడి సహకారం అందించారు.

ఈ ఘటనపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు సమాచారం అందించినట్లు ఆమె తెలిపారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి కుక్కలను పట్టుకునే చర్యలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.

పలు వార్డుల్లో కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండ గా, పిల్లలను ఒంటరిగా బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కుక్కల గుంపులు కనిపిస్తే వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.