ముగ్గురమ్మల మూలపుటమ్మ
* మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలోని శ్రీముత్యాలమ్మ ఆలయం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ముత్యాలమ్మ, మారెమ్మ, పెద్దమ్మ, లోతుకుంట మైసమ్మ తల్లులు కొలువై ఉన్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా భక్తులు బోనాలు సమర్పిస్తుంటారు.
గ్రామ రక్షకురాలిగా, పంటల పరిరక్షకురాలిగా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే తల్లిగా, కరువు కాటకాల నుండి కాపాడే కల్పవల్లిగా గ్రామ దేవతలను కొలవడం దశాబ్దాల ఆనవాయితీ. మనసులో అనుకున్నవి నెరవేరితే భక్తులు మళ్లీ వచ్చి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు.
ముత్యాలమ్మ తల్లికి ఇనుగుర్తి, చిన్ననాగారం, కేసముద్రం, నెల్లికుదురు తదితర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి బోనాలు సమర్పిస్తారు. రోజుకో గ్రామం చొప్పున బోనాలు సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. తొలుత చిన్ననాగారం గ్రామస్తులు మహాశివరాత్రికి ముందు వచ్చే బుధవారం, లేదంటే ఆదివారం రోజు ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి బోనాల వేడుకలకు శ్రీకారం చుడుతారు.
ఆ తరువాత ఏడాది పొడవునా ఆయా గ్రామాల ప్రజలు ఒక రోజు నిర్ణయించుకుంటారు. పిల్లాపాపలతో మూకుమ్మడిగా ముత్యాలమ్మ తల్లి ఆలయానికి తరలివెళి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి అనుగ్రహంతో పండిన పంటల దిగుబడులను, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, కొత్త బట్టలు, వండిన నైవేద్యంతో బోనం, యాట పోతులు, మేకలు, కోళ్లు బలిస్తారు.
మహిళలు బోనాలు ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి, దేవతలకు బోనం సమర్పిస్తారు. కొందరు తమను కరువు కాటకాలనుంచి కాపాడాలని, పశుసంపదను రక్షించాలని కోరుతూ ప్రత్యేకంగా రూపొందించిన మేకల బండ్లతో తరలివస్తారు. ఇంకో విశిష్టత ఏమిటంటే రావి వేప, చెట్లు కలిసి ఉండడంతో లక్ష్మీనారాయణ స్వరూపంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
వద్దిరాజు సోదరులచే ఆలయ పునరుద్ధరణ
చారిత్రక చిన్ననాగారం ముత్యాలమ్మ దేవాలయాన్ని ఇనుగుర్తి వాసి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కిషన్, దేవేందర్, వెంకన్న సోదరులు సుమారు అరకోటికి పైగా రూపాయలతో పునరుద్ధరించారు. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
దీనితో చాలా ఏళ్లకాలం నుంచి ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవంగా విలసిల్లుతున్న ముత్యాలమ్మ దేవాలయం పునరుద్ధరణలతో సరి కొత్త రూపును సంతరించుకుంది. అలాగే తమిళనాడుకు చెందిన కన్నయ్య మేస్త్రి భారీ ఆర్చి నిర్మించడంతో ఆలయానికి కొత్త ఆకర్షణగా నిలిచింది. ఈ ఆలయానికి చేరుకోవడానికి మహబూబాబాద్, కేసముద్రం, తొర్రూరు, వరంగల్ నుండి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది.
బండి సంపత్‌కుమార్,
(మహబూబాబాద్, విజయక్రాంతి)






