17 August, 2026 | 7:39 PM

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ‘ప్రజావాణి’ కార్యక్రమం

17-08-2026 05:24 PM

గంభీరావుపేట ప్రజావాణికి 7 దరఖాస్తులు..

ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న నోడల్ అధికారి, ఎంపిడిఓ రాజేందర్..

గంభీరావుపేట, ఆగస్టు 17 (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నోడల్ అధికారి, ఎంపీడీవో రాజేందర్ సూచించారు. సోమవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ మారుతి రెడ్డి, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా పలు సమస్యలు అధికారుల దృష్టికి వచ్చాయి.

కేజీ టు పీజీ విద్యాలయ ప్రాంగణంలోని బాలికల పాఠశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని  విద్యార్థి తండ్రి వినతి పత్రం సమర్పించాడు. అలాగే గంభీరావుపేటకు చెందిన వ్యక్తి ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఫిర్యాదు చేశాడు. 

ఇలా పలువురు ప్రజలు తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. హౌసింగ్ 2, ఇరిగేషన్ 1, రెవెన్యూ 1, పంచాయతీ రాజ్ 1, ఎడ్యుకేషన్ 1, అగ్రికల్చర్ 1 ప్రజావాణిలో మొత్తం 7 దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో తెలిపారు. అయితే ఆర్డబ్ల్యూఎస్, పోలీస్, ఆర్టీసీ, ఆర్&బి, ఎక్సైజ్ శాఖలకు చెందిన అధికారులు మొదటి రోజే గైర్హాజరు కావడం విమర్శలకు దారితీసింది.