17 August, 2026 | 6:42 PM

మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు సభకు మున్సిపల్‌ పాలకవర్గం సన్నాహాలు

17-08-2026 05:27 PM

సభ ఏర్పాట్లను పరిశీలించిన చైర్మన్‌ వోడ్నాల శ్రీనివాస్‌

మంథని, ఆగస్టు 17 (విజయక్రాంతి): ఈ నెల 19న బుధవారం మంథని పట్టణంలో గౌరవ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిర్వహించనున్న సభకు సంబంధించిన ఏర్పాట్లను మంథని మున్సిపల్‌ పాలకవర్గం పరిశీలించింది. మున్సిపల్‌ చైర్మన్‌ వోడ్నాల శ్రీనివాస్, వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్కింగ్‌, తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్‌ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు ముందుగానే పూర్తి చేయాలని చైర్మన్‌ వోడ్నాల శ్రీనివాస్‌ అధికారులకు, సిబ్బందికి సూచించారు.

మంత్రి శ్రీధర్ బాబు సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. సభ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు పెంటరి రాజు, యేల్లంకి వంశీధర్, నాయకులు ఎరుకల రమేష్, ఖాజా, సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.