13 April, 2026 | 1:55 AM

కష్టపడ్డ వారికి పార్టీ గుర్తింపు ఉంటుంది

13-04-2026 12:26 AM

రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ్మ

ఘనంగా ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం

2023లో కార్యకర్తలంతా కాటాను ఎమ్మెల్యే చేయాలి

పటాన్ చెరు, ఏప్రిల్ 12: పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఏవూరి శివానందం, వైస్ చైర్మన్ రాజశేఖర్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ్మ హాజరయ్యారు.

ఈ మేరకు నియోజకవర్గ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ చౌరస్తాలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు తరలివచ్చారు. నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ నూతన పాలక వర్గానికి ప్రమాణ స్వీకారం అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గానికి ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో పటాన్ చెరు రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందిందని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాట శ్రీనివాస్ గౌడ్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారన్నారు. అందరూ కలిసి మెలిసి పని చేసి  పటాన్ చెరు కాబోయే ఎమ్మెల్యేగా కాట శ్రీనివాస్ను గెలిపించాలన్నారు.

పేదవారికి ప్రామాణికమైన విద్య, నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమం, విద్య, వైద్య రంగాలతో పాటు మహిళా సాధికారతకు సీఎం రేవంత్ కట్టుబడి ఉందన్నారు. ఇందిరమ్మ మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.