30 May, 2026 | 1:35 AM

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

30-05-2026 12:29 AM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 29 (విజయక్రాంతి): అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను కోరారు. శుక్రవారం ఐడిఓసీ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సిరిశెట్టి సంకీర్త్ తో కలిసి పౌర సరఫరాలు, రవాణా, వ్యవసాయ, సహకార, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో పాటు మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు, పిఎసిఎస్ సీఈఓలు, ఏపిఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్కల కొనుగోలులో రాష్ట్రంలో మన జిల్లా మొద టి స్థానంలో ఉన్నదని, అదే స్ఫూర్తితో ధా న్యం కొనుగోళ్లలో సైతం వేగం పెంచాలని సూచించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు తప్పనిసరిగా ట్రక్ షీట్ ఇవ్వాలని, ధాన్యం కాంటా జరిపిన వెంటనే ట్యాబ్ ఎంట్రి కచ్చితంగా చేయాలని తెలిపారు.

ఐరిస్ పద్ధతిని తొలగించి ఓటిపి ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మరో వారంలోగా కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే రైతులకు ట్రక్ షీట్ ఇవ్వాలని ఆదేశించారు. ట్రక్ షీట్ ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలలో ఖచ్చితమైన లక్ష్యం ద్వారా ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని స్పష్టం చేశారు.

పిఎసిఎస్ సీఈఓలు, ఏపిఎంలు క్షేత్రస్థాయిలో పరిశీలించి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ప్రతి రోజు కచ్చితంగా 8 వేల మెట్రిక్ టన్నులు  కొనుగోలు జరిగేలా చూడాలని ఆదేశించారు. లారీలు కొరత ఉంటే ట్రాక్టర్లు ద్వారా మిల్లులకు తరలించాలని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా ఎత్తున ప్రదేశాలలో నిల్వ ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పౌరసరఫరాల సంస్థ, రవాణా, డి ఆర్ డి ఓ, సహకార శాఖల అధికారులు, మిల్లర్లు పిఎసిఎస్ సీఈవోలు, ఏపీఎంలు పాల్గొన్నారు.