ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి
జిల్లా ప్రత్యేక అధికారి షఫీయుల్లా
నాగర్ కర్నూల్, జూన్ 29 (విజయక్రాంతి): ప్రజాపాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ప్రత్యేక అధికారి షఫీయుల్లా ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్తో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి శాఖకు నిర్దేశించిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేయడంతో పాటు అభివృద్ధి పనుల్లో నాణ్యత, పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని సూచించారు. గ్రామస్థాయిలో అధికారులు నిరంతరం పర్యటిస్తూ ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.






