27 June, 2026 | 3:07 AM

బోగస్ ఓట్ల ప్రక్షాళనే ఎస్‌ఐఆర్ లక్ష్యం

27-06-2026 01:44 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీల్ రావు 

ముకరంపుర, జూన్ 26 (విజయక్రాంతి): ఓటరు జాబితాను ప్రక్షాళన చేసి పకడ్బందీ ఓటర్ల జాబితాను తయారు చేయడమే ‘ఎస్‌ఐఆర్‘ ముఖ్య ఉద్దేశమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బోగస్ ఓట్లను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు.

చాలా మంది ప్రజలు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వలస వెల్లడం జరుగుతుందని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణీకరణ పెరిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల కంటే ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసించడం జరుగుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరికి రెండు చోట్ల ఓటు కలిగి ఉండటం,చాలా కాలంగా చనిపోయిన వ్యక్తుల యొక్క ఓటు అలాగే ఉండటం, ఓటర్ రిజిస్ట్రేషన్లు అధికంగా చేస్కోవడం, అర్హత లేని ఓటర్లను జాబితాలో ఉండటం లాంటి పలు కారణాల రీత్యా ఎస్‌ఐఆర్ ప్రక్రియ చాలా అవసరమని తెలిపారు.

ఇలాంటి బోగస్ ఓట్లను సరిదిద్దడానికి...ఓటర్ జాబితాను శుద్ది చేయడానికే ప్రభుత్వం ‘ సర్‘ ఇంటింటి సర్వేను చేపట్టిందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండాలని యువతి యువకులు ఓటు హక్కును తప్పక నమోదు చేస్కోవాలని పిలుపు నిచ్చారు. రాజకీయ పార్టీల నాయకులు ఎస్‌ఐఆర్ ప్రక్రియ పై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాదాపు 80 లక్షల ఓట్ల తొలగించారని తప్పుడు వాఖ్యాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.

పశ్చిమ బెంగాల్ లో దాదాపు 27 శాతం ముస్లిం మైనారిటీ జనాభా ఉందని వెల్లడించారు. పలు జిల్లాలో 66 శాతం ముస్లిం జనాభా అధికంగా ఉందని వెల్లడించారు. మాల్దాల్ 51.7 శాతం మైనారిటీ జనభా ఉంటే 12 సీట్లలో 7 స్థానాలు బీజేపీ గెలిచిందన్నారు. అంతే కాకుండా దినాస్ పూర్ 50 శాతం ఓట్లు ఉంటే 9 సీట్లలో 5 బీజేపి గెలిచిందన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజల అభిమానం,మద్దతు తో గెలుస్తుంది తప్పా ఎస్‌ఐఅర్ ప్రక్రియ వల్ల కాదని వెల్లడించారు.

కెరళ, తమిళనాడు రాష్ట్రం ఎస్‌ఐఆర్ ప్రక్రియ అనంతరమే ఎన్నికలు జరిగాయని మరి అక్కడ బిజెపి ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు. ఎక్కడ కూడ ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా ఎవ్వరికి అన్యాయం జరగలేదని అన్ని వర్గాలకు సమన్యాయం దక్కిందని అన్నారు. సర్ ప్రక్రియ మొదటి సారి జరగడం లేదని గతంలో కూడ ఎస్‌ఐఆర్ చేయడం జరిగిందని చెప్పారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఒక వార్డుకు సంబంధించిన ఓటర్ జాబితా ఒక భాగం లిస్టులో 17 మంది మరణించిన వారి ఓట్లు ఉన్నాయని 54 ఓట్లు ఉన్న ఒక భాగం జాబితాలో 17 ఓట్లు చనిపోయిన వ్యక్తులై ఉండటం భావ్యమా అని ప్రశ్నించారు.

ఇలాంటి తప్పుల ఓటర్ జాబితా ఉంటే ఓటింగ్ శాతం ఎలా పెరుగుతుందని దీనిపై ప్రతి పక్షాలు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాను సరిదిద్దనంత వరకు ఓటింగ్ శాతం పెరగదని సరైన ఓటర్ జాబితా ఉండటమే భావ్యం అన్నారు. ఎక్కడ కూడ మైనారిటీ ఓటు తీసే ఆలోచన గాని అవకాశం లేదని మైనారిటీ ప్రజలు ఆంధోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.