24 April, 2026 | 1:58 AM

ఓబీసీ సందేశం తెలంగాణ నుంచే దేశానికి ఇవ్వాలి

24-04-2026 12:35 AM
  1. రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే ఓబీసీలకు న్యాయం
  2. తెలంగాణలో సభ నిర్వహించాలని రాహుల్‌ను కోరాను  
  3. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు 

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని, రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే ఓబీసీలకు రాజకీయంగా న్యాయం జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. తెలంగాణలో కులగణన చేశామని, ఈ సందేశం దేశ వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు రాష్ట్రంలో భారీ సభను ఏర్పాటు చేయాలని రాహుల్‌గాంధీని కోరినట్లు వీహెచ్ తెలిపారు. ఏఐసీసీ ఓబీసీ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది.

రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమైన అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం చేపట్టే జనగణన ప్రశ్నావలి పత్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు లెక్కలకు ప్రత్యేక కాలం పెట్టిన కేంద్రం.. ఓబీసీలకు వచ్చేసరికి ప్రత్యేక కాలం ఎందుకు పెట్టలేదని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వం ఓబీసీలంటే లెక్కలేకుండా వ్యవహారిస్తోందని ఆయన మండిపడ్డారు. రాహుల్‌గాంధీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు, అబద్ధాలను  ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారని తెలిపారు.

మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాహుల్‌గాంధీని కోరినట్లు వీహెచ్ తెలిపారు. రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకే తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టిందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి, గవర్నర్‌కు పంపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కోర్టులో టెక్నికల్ కారణాలతో బిల్లు ఆగిపోవడంతో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా ఎక్కువగా అవకాశాలు కల్పిస్తే .. 52 శాతానికి పైగా గెలిచారన్నారు.

2002 సంవత్సరంలో వరంగల్‌లో సోనియాగాంధీ బీసీల సభ నిర్వహించాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ వచ్చిందని, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేయగా అధికారంలోకి వచ్చామన్నారు. ఓబీసీలు ఓట్లు వేసే మిషన్లం కాదన్నారు. తెలంగాణలో సభ నిర్వహించాలని, ఇందిరగాంధీ మనవడిగా ప్రజలు ఆదరిస్తారని ఆయన పేర్కొన్నారు.

 హైదరాబాద్‌లో ఏఐసీసీ ఓబీసీ సమావేశం!

తెలంగాణ రాజకీయాల్లో ఓబీసీ అంశం కొంత కాలంగా ప్రధాన చర్చగా నడుస్తోంది. ఓబీసీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కులగణన చేపట్టి ఆ లెక్కలను ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ ఈ అంశంలో మరోకీలక నిర్ణయం తీసుకున్నది. రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది.

ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష రాహుల్‌గాంధీతో గురువారం ఢిల్లీలో ని 10 జన్‌పథ్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ భేటీ అయ్యారు. అంతకు ముందు పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, ఎంపీ అనిల్‌కుమర్ యాదవ్ కూడా రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపైన రాహుల్‌గాంధీకి వివరించారు.

వచ్చే ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని తెలంగాణలో నిర్వహించాలని కోరగా, రాహుల్‌గాంధీ స్పందించినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహించి అధికారిక సమాచారాన్ని ప్రకటించిన విషయాన్ని రాహుల్‌గాంధీకి పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ వివరించారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా జోడించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ పరంగా జరుగుతున్న ఆర్గనైజేషన్ కార్యక్రమాలను వివరించారు. డీసీసీ అధ్యక్షుల నియామకాలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, బీఎల్‌ఓలు, సంఘాల నియామకాల అంశాలను రాహుల్‌గాంధీకి తెలిపారు.