22 June, 2026 | 2:59 AM

నేను చచ్చినా ఉద్యమం ఆగొద్దు!

22-06-2026 01:29 AM
  1. 2028లో ఎగిరేది టీఆర్పీ జెండానే
  2. రాష్ట్ర కమిటీ సమావేశంలో అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
  3. మహిళా ప్రధాన కార్యదర్శిగా మీనాగౌడ్ 

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. జూలై 5న జరగబోయే రాజ్యాధికార సమరభేరి సభ బీసీల తలరాతలను మార్చే సభ అని, ఈ సభ తర్వాత కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను ప్రజలను తన్ని తరిమేస్తారని అన్నారు.

దశాబ్దాల బీసీల ఆకాంక్షను నెరవేర్చడం కోసం పుట్టిన పార్టీని ప్రజలు తమ ఇంటి పార్టీగా భావిస్తున్నారని, నేను చచ్చినా కూడా ఈ ఉద్యమం ఆగకూడదని అన్నారు. సభ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీల పని తీరుపై ఆయన సమీక్షించి పలు సూచనలు చేశారు. ప్రజలను పెద్ద ఎత్తున ఈ సభకు తరలించాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. 2028లో ఎగిరేది టీఆర్పీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.

కాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీ కుమార్ యాదవ్ సమావేశం ఎజెండాను ప్రవేశపెట్టారు. అనంతరం తీన్మార్ మల్లన్న అమెరికా పర్యటనలో బీసీ ఎన్‌ఆర్‌ఐలతో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమ విషయాలను రాష్ట్ర కమిటీకి తెలియజేశారు. బీసీ ఉద్యమానికి అమెరికాలోని వివిధ రాష్ట్రంలో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ ఉద్యమంలో తాము సైతం భాగస్వాములు అవుతామమన్నారని చెప్పారు. దాదాపు ఆరు రాష్ట్రాల ఎన్‌ఆర్‌ఐలతో సమావేశాలు నిర్వహించానని చెప్పారు. ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ వింగ్ ఇంచార్జి లింగాల గంగాధర్ ఆధ్వర్యంలో మరో సారి అమెరికా పర్యటన చేసి డల్లాస్‌లో ఐదు వేల మందితో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో రాజ్యాధికార సమరభేరి సభ ఏర్పాట్లపై  మల్లన్న సుదీర్ఘంగా చర్చించారు. సభా అధ్యక్షులుగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొమిరిశెట్టి నర్సింహులు బాధ్యులుగా ఉంటారని తెలియజేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గంగాధర్ లింగాల, వేముల వాడ మదన్ మోహన్ చారి, ఆర్.భవనా వెంకటేష్, జ్యోతి పండేల్, రాష్ట్ర కోశాధికారి కొక్కలకొండ మనోజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, ఆకుల హనుమాన్లు, కోమల్ల మంజుల గౌడ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ, కార్మిక విభాగం అధ్యక్షులు, సంకూరి శ్రీనివాస్ యువజన విభాగం అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, మైనారిటీ విభాగం అధ్యక్షులు సల్మాన్, విద్యార్థి విభాగం అధ్యక్షులు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా బత్తిని మీనా గౌడ్‌ను నియమిస్తూ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ ప్రకటించారు.

నియామక పత్రాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అందజేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న చేపట్టనున్న పాదయాత్రకు ప్రత్యేకంగా రూపొందించిన పాటకు సంబంధించిన ప్రోమోను పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ పాటను పెద్దపల్లి రాజన్న రచన అందివ్వగా,మెదక్ జిల్లా టిఆర్పి పార్టీ అధ్యక్షులు ఇమాపురం యాదగిరి గౌడ్ నిర్మాతగా వారి ఆధ్వర్యంలో తీసుకొచ్చారు. తీన్మార్ మల్లన్న చేపట్టబోయే పాదయాత్రకు సంబంధించిన పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొని యాదగిరిగౌడ్‌ను అభినందించారు.

మిషన్ భగీరథ యూనియన్ సభ్యుల చేరిక

యాదాద్రి భువనగిరి జిల్లా మిషన్ భగీరథ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ అధ్యక్షుడు మంగ కరుణాకర్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ సంస్థ అయిన టీఆర్‌కేవీలో చేరారు. పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న సమక్షంలో, టీఆర్‌కేవీ రాష్ట్ర అధ్యక్షులు సంకూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్మోహన్ చారీ, ఆర్ భావన వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్  గాజుల మహేష్, నంగునూరి సాయి,సతీష్, మధు, కరుణాకర్, సురేష్, మహేష్, వెంకటేష్, శ్యామ్, రాకేష్, నరేందర్, బాల నర్సింహా, భాను పాల్గొన్నారు

సమరభేరి సభ పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్‌లో ఆదివారం జూలై 5న నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మోటపోతుల సమ్మయ్య, మడే సంతోష్, జినుకల శ్రీను, అశోక్, కృష్ణ ప్రశాంత్, శ్రీపతి, భద్రయ్య, రంజిత్, మోహన్ పాల్గొన్నారు.

మల్లన్నను కలిసిన అంద కళాకారులు 

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను అందకళాకారుల బృందం పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కళాకారులు తమ వృత్తికి సంబంధించిన సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను మల్లన్న దృష్టికి తీసుకెళ్లారు. అంద కళాకారుల సంక్షేమం, ఉపాధి భద్రత, ప్రభుత్వ పరంగా అందాల్సిన ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాలపై చర్చించారు. కళాకారుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున సహకరిస్తానమన్నారు.