దోచుకోవడమే ఎంమ్మెల్యేకు తెలుసు
బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్
మంచిర్యాల, మే 1 (విజయక్రాంతి) : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావుకు దోచుకోవడమే తప్ప అభివృద్ధి చేసి చూపించడం తెలియదని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆరోపించారు. శుక్ర వారం మంచిర్యాల మాజీ ఎంఎల్‌ఏ నడిపెల్లి దివాకర్ రావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎంఎల్‌ఏగా గెలిచిన రెండు సంవత్సరాలలో చేసింది ఏమిటంటే అడ్డగోలుగా దోచుకోవడం, దోచుకున్న పైసలు పంచుకోవడం, దాచుకోవడానికే సరిపోయిందన్నారు. దోచుకున్నది పంచుకోవడంలో ఎంఎల్‌ఏకు, ఆయన ప్రధాన అనుచరుడు తేడా రావడంతోనే వారి మధ్య విభేదాలు వచ్చాయని, ఇది నియోజక వర్గ ప్రజలందరికి తెలిసిన విషయమేనని, రానున్న రోజులలో దోపిడి లెక్కలతో సహా బయటికి వస్తాయన్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రతిపాదన, ఆలోచన నడిపెల్లి దివాకర్ రావుదని, దానిని మంచిర్యాల ఎమ్మెల్యే చెప్పుకోవడం హస్యాస్పదమని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్ పేర్కొన్నారు. లక్షెట్టిపేటలో ప్రభుత్వ ఆసుపత్రిని కట్టించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమైతే పదిసార్లు ఆసుపత్రిని విజిట్ చేసి, ప్రెస్ మీట్ లు పెట్టి వారే హాస్పిటల్ కట్టినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ప్రజలు గమనిస్తున్నారన్నారు.
మంచిర్యాలలో నాలుగు కోట్ల స్మశాన వాటికను రూ. 14 కోట్లు బిల్లులు తీసుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని విజిత్ రావు ఆరోపించారు. వేంపల్లి, పోచంపాడు గ్రామాలలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట రూ. 500 కోట్ల విలువ చేసే దళితుల భూములను దోచుకున్నారన్నారు.
జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయానికి అప్పటి ఎంఎల్‌ఏ దివాకర్ రావు రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేస్తే ఆ పనులు మొదలుపెట్టకుండా, ఆ పనులు పూర్తయితే దివాకర్ కి పేరు వస్తుందని చెప్పి దేవుని దగ్గర కూడా రాజకీయం చేసి ఆ నిధులు నిలిపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా విజిత్ రావు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ నాయకులు పెట్టం లక్ష్మణ్, సత్యం, రవీందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.






