calender_icon.png 5 February, 2026 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగంలోకి ఇంచార్జ్జి మంత్రి

05-02-2026 12:00:00 AM

  1. మున్సిపోల్స్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టి 

కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయం

మూడు మున్సిపాలిటీలలో మారుతున్న సమీకరణాలు

బీఆర్‌ఎస్ శిబిరంలో ఆందోళన

మేడ్చల్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్య ర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలోని మూడు మున్సిపాలిటీ లలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటివరకు బలహీనంగా కని పించిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా పుంజుకుంటుంది. మున్సిపాలిటీల గెలుపు బాధ్యత ఇన్చార్జి మంత్రులదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఇన్చార్జ్ మంత్రి జిల్లాలోని మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మున్సిపల్ ఎన్నికలకు ఇన్చార్జిగా నియమించారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మూడు మున్సిపాలిటీలు మాత్రమే ఉన్నాయి. ఇన్చార్జి మంత్రి సొంత జిల్లా అయిన నల్గొండ తో పాటు మేడ్చల్ జిల్లా లో మున్సిపాలిటీలను పర్యవేక్షిస్తున్నారు.

డిసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, ఇతర నాయకులతో సమన్వయం చేసుకోవడమే గాక సీనియర్ నాయకులకు మున్సిపల్ బాధ్యతలు అప్పజెప్పారు. ఎల్లంపేట మున్సిపాలిటీకి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని, మూడు చింతలపల్లి మున్సిపాలిటీకి డిసిసి మాజీ అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డిని ఇన్చార్జిగా ఉన్నారు. అలియాబాద్ ఇన్చార్జిగా నక్క ప్రభాకర్ గౌడ్, మహిపాల్ రెడ్డి కొనసాగుతున్నారు.

వీరు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. వాస్తవానికి ఎన్నికల షెడ్యూలు విడుదలైన సమయంలో బి ఆర్ ఎస్ కు పూర్తిగా అనుకూల వాతవరణం ఉంది. సర్వేలలో కూడా టిఆర్‌ఎస్ గెలుపొందుతుందని తేలింది. నాయకత్వ లోపం, బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే మల్లారెడ్డి హడావిడితో కాంగ్రెస్ బలహీనంగా కనిపించింది. ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల పరిస్థితి మారిపోయింది.

ఎల్లంపేటలో పోటాపోటీ 

ఎల్లంపేట మున్సిపాలిటీలో మొదట బీఆర్‌ఎస్ కు అనుకూలంగా ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బిజెపి పార్టీల మధ్య పోటా పోటీ ఉంది. సుధీర్ రెడ్డికి ఇక్కడి పరిస్థితులు నాయకులపై పూర్తి అవగాహన ఉంది. చేరికలపై దృష్టి పెట్టారు. టిఆర్‌ఎస్ కచ్చితంగా గెలుస్తున్న నా వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థుల సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు.

అలియాబాద్‌లో జోరుగా ప్రచారం 

అలియాబాద్‌లో మూడు పార్టీలు జోరు గా ప్రచారం చేస్తున్నాయి. ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. మంత్రి కార్యక్రమం తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ఇంచార్జీలుగా నక్క ప్రభాకర్ గౌడ్, మహిపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

నక్క ప్రభాకర్ గౌడ్ గతంలో జడ్పిటిసి సభ్యుడిగా పని చేయడంతో ఇక్కడ విస్తృత పరిచయాలు ఉన్నాయి. దీంతో ఆయన పాత పరిచయాలతో అందరినీ సమీకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అలియాబాద్ కు చెందిన కృష్ణారెడ్డి భార్యను చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. అలియాబాద్ లో ఏడు వార్డులు ఉన్నాయి. స్థానిక అభ్యర్థి కావడం సానుకూల అంశంగా మారింది. 

హరివర్ధన్‌రెడ్డికి ఎంసీపల్లి బాధ్యతలు 

డిసిసి మాజీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డికి తాజాగా మూడు చింతలపల్లి బాధ్యతలు అప్పగించారు. ఎంసిపల్లి జెడ్పిటిసి సభ్యుడిగా పనిచేసినందున ఈ ప్రాంతంపై పూర్తిగా అవగాహన ఉంది. అంతేగాక యూత్ ఫాలోయింగ్ కూడా ఉంది. మంత్రి కోమటిరెడ్డి తో కలిసి ఎన్ ఎస్ యు ఐ లో పనిచేశారు. వీరిద్దరి మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. వెంకటరెడ్డి సూచన మేరకు హరివర్ధన్ రెడ్డి చాలెంజిగా తీసుకున్నారు. 

బీఆర్‌ఎస్‌లో ఆందోళన 

మూడు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో బి ఆర్ ఎస్ శిబిరంలో ఆందోళన మొదలైంది. మూడు మున్సిపాలిటీలను గెలుచుకుంటామని ఆ పార్టీ నాయకులు భావించారు. క్రమేపి కాంగ్రెస్ పరిస్థితి మెరుగు కావడమే గాక అధికారంలో ఉన్నందున పోలింగ్, చైర్మన్ ఎన్నికల వరకు ఏమి చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ కూడా అనుకూల పరిస్థితి ఉన్నందున చేజారకుండా చూసుకోవాలని భావిస్తున్నారు.