ఘనంగా స్వామివారి నిత్యకల్యాణం
యాదగిరిగుట్ట, మార్చి 26: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో గురువారం శాస్త్రోక్తంగా నిత్య పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవతో స్వయంభులను మేల్కొల్పిన అర్చకులు గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్టమూర్తులను వేదమంతోత్సవములు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలలను అర్పించారు. ప్రాకారమంటపంలో సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం పండితులు ఘనంగా నిర్వహించారు.
భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని మొక్కలను చెల్లించుకున్నారు. సాయంత్రం స్వామివారి వెండి జోడు సేవలో స్వామివారిని అలంకరించి తిరువీధులలో ఊరేగించారు. కొండపైన అనుబంధ ఆలయం శ్రీ రామలింగేశ్వర శివాలయంలో నిత్య కైంకర్యాలను పండితులు నిర్వహించారు. స్వామివారి నిత్య రాబడి.. 13,23,970/- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి వివిధ శాఖల నుండి వచ్చిన ఆదాయం 13,23,970/- వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.




