కుమ్మెర ఘటన కనువిప్పు కావాలి!
మన్నారం నాగరాజు :
‘సామాజిక న్యాయం’ అనే నినాదం భారత రాజకీయా ల్లో ఒక పవిత్ర మంత్రంలా వినిపిస్తుంది. ప్రతి ఎన్నికల కాలంలో అది ఓట్లను ఆకర్షించే రాజకీయ మంత్రంగా మారుతుంది. కానీ ఆ నినాదం ప్రజల జీవితాల్లో అనుభూతిగా మారుతుందా అనే ప్రశ్న మాత్రం ప్రతి పసికూన మరణంతో, ప్రతి కుల హింస ఘటనతో మన ముందుకు వస్తూనే ఉంది.
కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటన ఒక గ్రామీణ ఘర్షణగా తేల్చే స్థాయిని దాటిపోయి తెలంగాణ సమాజపు నైతిక అంతరా త్మను ప్రశ్నించేందుకు బాటలు వేసింది. ఒక పసికూనను కాళ్లతో తన్ని చంపిన కుల దురహంకారం మనం గర్వంగా చెప్పుకునే ఆధునిక ప్రజాస్వామ్యపు ముఖంపై పడిన ఒక శాశ్వత మచ్చ.
నాగర్ కర్నూల్ మండలంలోని కుమ్మెర గ్రామంలో చాకలి కుటుం బంపై జరిగిన దాడి, ‘తక్కువ జాతి’ అనే ప దంతో దేవుడి దర్శనానికి కూడా అర్హులు కా దని చెప్పడం, వంద రూపాయల కోసం కు టుంబాన్ని అవమానించడం, మహిళలను కిందకు తోసేయడం, చిన్న కుమారుడిని కొ ట్టడం, చివరకు పసికూన ప్రాణం పోవడం.. -ఇవి ఒకే సంఘటనలో చోటు చేసుకున్నాయంటే మన నాగరికత ఎంత మేరకు మా నవత్వాన్ని కోల్పోయిందో అర్థమవుతున్నది.
ప్రజాస్వామ్యమెక్కడ?
ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మౌనం దాల్చడం రాజకీయ వ్యూహ మా లేక నైతిక వైఫల్యమా అనే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది. ఈ అమానుష ఘట నపై సీఎం రేవంత్ నుంచి ప్రతిస్పందన లేకపోవడం ప్రజాస్వామ్యానికి సవాల్‌గా మా రింది. ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల ప్రక్రి య కాదు, అది ఒక నైతిక ఒప్పందం. ప్రజ లు ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగిస్తారు, ప్రభుత్వం ప్రజల గౌరవాన్ని, భద్రతను, స మానత్వాన్ని రక్షించాలి.
ఒక పసికూన ప్రా ణం పోయినప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాస్వామ్యం ఎవరి కోసం పని చేస్తోంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. శక్తివంతమైన కుల సమూహాల కోసం లేదా రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాల కో సం వేస్తున్న ఈ ప్రశ్న కేవలం రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, భారత ప్రజాస్వామ్యానికి కూ డా సవాల్ లాంటిదే.
ప్రజాస్వామ్యం శక్తివంతుల రాజకీయ ఒప్పందమైతే, అది ప్రజా స్వామ్యం కాదు, ఆధిపత్య రాజకీయ వ్యవస్థ అవుతుంది. రాజ్యాంగం ఒక సామాజిక ఒ ప్పందం, ఆ ఒప్పందం ప్రతిరోజూ వీధుల్లో అమలయ్యే విధానంగా మారకపోతే కేవలం ఒక పుస్తకంగానే మిగిలిపోతుంది.
ఆధిపత్యం తగ్గాలి..
కుల దురహంకార హింసను భారత స మాజం తరచుగా ‘సామాజిక సమస్య’గా మాత్రమే చూస్తుంది. కానీ కులం ఒక సా మాజిక సమస్య కాదు, అది ఒక రాజకీయఆర్థిక నిర్మాణం. భూమి, వనరులు, విద్య, ఉ ద్యోగాలు, రాజకీయ ప్రతినిధిత్వం -ఈ అ న్నింటినీ నియంత్రించే ఒక శక్తి వ్యవస్థ కు లం. కుల దురహంకార హింస ఆ శక్తి వ్యవస్థను కాపాడుకునే ఒక సాధనం. తక్కువ కులంగా గుర్తించిన వారిని భయపెట్టి, వారి శరీరాలపై ఆధిపత్యం చెలాయించడం సరికాదు. కుమ్మెర ఘటనే ఇందుకు ఒక ఉదాహరణ. అంబేద్కర్ దృష్టిలో కులం ఒక సామాజిక దాస్య వ్యవస్థ.
కుమ్మెర ఘటన అంబేద్కర్ సిద్ధాంతానికి ఆధునిక ఉదాహరణ. దేవుడి దర్శనానికి కూడా అర్హులు కాద ని చెప్పడం- మానవత్వాన్ని నిరాకరించే ఒక మత సామాజిక ఫాసిజం. ‘కుల గౌరవం’ అనే భావన ఒక మానసిక నియంతృత్వం. అది ప్రేమను నేరంగా, సమానత్వాన్ని అపరాధంగా, మానవత్వాన్ని తిరుగుబాటుగా మార్చుతుంది. ఈ మానసిక నియంతృత్వం గ్రామాల్లో మాత్రమే కాదు, నగరాల్లో, విశ్వవిద్యాలయాల్లో, కార్యాలయాల్లో కూడా సూక్ష్మ రూపంలో కొనసాగుతుంది.
నిర్మాణాత్మక లోపం..
ఈ ఘటనలో పోలీసు వ్యవస్థ కూడా తీ వ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఫిర్యాదుల ఆలస్యం, రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావశీల కులాల పట్ల మృదుత్వం, బాధితుల పట్ల నిర్లక్ష్యం -పోలీసు వ్యవస్థను నిర్మాణాత్మక లోపంగా మార్చేసింది. బాధిత కుటుంబం వేడుకున్నా రక్షణ లభించకపోవడం ప్రజాస్వామ్యానికి ఒక నైతిక అపరాధం. చట్టం పుస్తకాల్లో సమానత్వంలా ఉంటే సరిపోదు, అది వీధుల్లో అమలు కావాలి.
గ్రామ సర్పం చ్, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నా యకుల మౌనం కూడా అపరాధమే. ప్రజాప్రతినిధులు సమాజంలోని శక్తివంతమైన కుల సమూహాలను ఎదుర్కొనే ధైర్యం లేకపోతే ప్రజాస్వామ్యం కులాధిపత్యానికి బానిసగా మారుతుంది. ఓటు బ్యాంక్ రాజకీయాలు కుల హింసలకు మౌన రక్షణగా మారాయి. రాజకీయ పార్టీలు కుల సంఘాలను ఎదుర్కొనే ధైర్యం కోల్పోయాయి. ఈ భయమే కుల దురహంకార హింసలకు కారణమవుతోంది.
చారిత్రక ప్రశ్నగా..
సామాజిక న్యాయం, దళితబహుజన హక్కులు, సమానత్వం అనే నినాదాలతోనే ఇవాళ కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి వ చ్చింది. కానీ చేసే నినాదాలు ఒకటి, ఆచరణ మరొకటి అన్న చందంగా భారత రాజకీయ వ్యవస్థ తయారైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం ఒక పాలనా వి ధానంగా మారకపోతే అది రాజకీయ మోస మే అవుతుంది. కుమ్మెర ఘటన ఈ ద్వంద్వత్వానికి ఒక నిర్దాక్షిణ్య సమాధానం.
ప్రజలు రాజకీయ నినాదాలపై కాదు, పాలనా ఆచరణపై తీర్పునిస్తారు. సామాజిక న్యాయం ప్రభుత్వ ప్రకటనల్లో కాకుండా పోలీసుస్టేషన్‌లో, కోర్టులో, గ్రామంలో అమలయ్యే వి ధానంగా మారాలి. మీడియా పాత్ర కూడా మేధోపరమైన విమర్శకు లోబడి ఉండాలి. కుమ్మెర ఘటన ఒక విషయాన్ని గుర్తుచేస్తున్నది. మనం గర్వంగా చెప్పుకునే అభివృద్ధి, డిజిటల్ విప్లవం, ప్రజాస్వామ్య హక్కులు, ఇవన్నీ ఒక పసికూన ప్రాణం ముందు అశక్తులుగా మిగిలిపోయాయి.
కుల గౌరవం పేరుతో మానవ గౌరవాన్ని అణచివేయడం ఒక సామాజిక నేరం మాత్రమే కాదు, అది ఒక నాగరికత వైఫల్యం. కుమ్మెర ఘటనలో మనం చూసింది ఒక కుటుంబ విషాదం కా దు, సామాజిక వ్యవస్థ క్రూరత్వం. ఒక పసికూన మరణం మనకు ఒక నైతిక అద్దాన్ని చూపించింది. తెలంగాణ సమాజం ఈ నైతి క పరీక్షలో ఉత్తీర్ణం కావాల్సిన అవసరముం ది. ఒక పసికూన ప్రాణం మన చరిత్రలో శాశ్వత ప్రశ్నగా మిగిలిపోతుంది.
ప్రజాస్వా మ్యం శక్తివంతుల రక్షణ కోసం కాదు, అశక్తుల గౌరవం కోసం. మనం మానవ గౌరవా న్ని ఎంచుకుంటే, తెలంగాణ నిజమైన ఆధునిక సమాజంగా మారుతుంది. కుల గౌరవానికే పట్టం కడితే, కుమ్మెర లాంటి ఘటనలు సమాజానికి మాయని మచ్చలా మిగిలిపోతాయడంలో ఎలాంటి సందేహం లేదు. -కులానికి విధేయులమవుదామా, మానవత్వానికి విధేయులమవుదామా అనేది సమాజ భవిష్యత్తును నిర్ణయించే చారిత్రక ప్రశ్నగా మిగిలిపోనుంది.




