26 February, 2026 | 1:57 AM

ఎన్సీఈఆర్‌టీ వివాదం!

26-02-2026 12:12 AM

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్‌టీ) అనేది భారత విద్యా వ్యవస్థలను పర్యవేక్షించే అత్యున్నత విద్యా సంస్థ. అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న ఎన్సీఈఆర్‌టీ ఇటీవలి కాలంలో వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తలో నిలుస్తూ వస్తున్నది. తాజాగా ఎన్సీఈఆర్‌టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను పొందుపరిచింది.

దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. న్యాయవ్యవస్థ, వాటి పనితీరు గురించి వివరించడం వరకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ న్యాయ వ్యవస్థలో అవినీతి, పెండింగ్ కేసుల అంశం, జవాబుదారీ యంత్రాగాలు, న్యాయవ్యవస్థలోని సమస్యలపై పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ వ్యవస్థ (సీపీజీఆర్‌ఏఎంఎస్) ద్వారా ఫిర్యాదు చేయడం వంటి అంశాలు న్యాయ వ్యవస్థనే కించపరిచేలా ఉన్నాయని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అభిపాయ్రపడ్డారు.

న్యాయవ్యవస్థను అపఖ్యాతి పాలు చేయడానికి ఎవరికీ అనుమతి లేదని, ఈ సమస్యను సుమోటోగా స్వీకరించి విచారణ చేపడతామన్నారు. అప్పటివరకు వేచి చూడాలన్నారు. గతంలో ఎన్సీఈఆర్‌టీ ప్రచురించిన పుస్తకాల్లో న్యాయవ్యవస్థ పనితీరు, కోర్టుల పాత్ర వరకే పరిమితమై ఉండేది. కానీ సోమవారం విడుదల చేసిన నూతన పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థ పాత్రలోని ఒక అధ్యాయంలో అవినీతి, ఆర్థికంగా బలహీన వర్గాలకు న్యాయం అందించడంలో ప్రభావం గురించి చర్చించారు.

అంతేకాదు మాజీ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ గతేడాది న్యాయవ్యవస్థలో అవినీతికి సంబంధించి చేసిన వ్యాఖ్యలను కూడా పాఠ్యాంశంలో చేర్చింది. ఎన్సీఈఆర్‌టీ తమ పాఠ్య పుస్తకాల్లో న్యాయవ్యవస్థలోని అవినీతి అంశాన్ని జోడించినప్పుడు.. మంత్రులు, ప్రజా సేవకులు, దర్యాప్తు సంస్థలు, రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతి గురించి పుస్తకాల్లో ఎందుకు ప్రచురితం చేయకపోవడంపై కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఆయన వాదనలోనూ నిజముంది.

పాఠశాల స్థాయిలో పిల్లలను విద్యావంతులను చేయాల్సింది పోయి ఇలాంటి సంక్లిష్ట అంశాలను జోడించడం సరికాదు. 8వ తరగతిలో విద్యార్థులకు పాలనా విభాగాలు, వాటి విధులను పరిచయం చేయడమే ఎన్సీఈఆర్‌టీ ముఖ్య ఉద్దేశం కావొచ్చు. కానీ న్యాయవ్యవస్థకు సంబంధించిన సున్నితమైన అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చడం ద్వారా తీర్పునిచ్చే వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పో యే పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదముంటుంది.

గతేడాది జూలైలో ఇదే 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో ఎన్సీఈఆర్‌టీ ‘ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్ (పార్ట్-1) పుస్తకంలో బాబర్, అక్బర్, ఔరంగజేబు క్రూరత్వ పాలనను పాఠ్యాంశాలుగా విడుదల చేయడం అప్పట్లో వివాదంగా మారింది. ఇక పార్-2లో ‘ఇండియాస్ లాంగ్ రోడ్ టూ ఇండిపెండెన్స్’ అధ్యాయాన్ని చేర్చిన ఎన్సీఈఆర్‌టీ దేశ విభజనకు కారణం కాంగ్రెస్ అని పేర్కొనడం రాజకీయ దుమారానికి దారి తీసింది.

చరిత్రలోని నిజాలను వక్రీకరిస్తూ విద్యార్థులను పూర్తి తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత హోదాలో ఉన్న ఎన్సీఈఆర్‌టీ ధోరణిలో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎన్సీఈఆర్‌టీని తమకు అనుకూలంగా మలుచుకుందనే ఆరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.