calender_icon.png 16 February, 2026 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణ వైభోగమే..కన్నుల పండువగా శివపార్వతుల లగ్గం

16-02-2026 12:09:40 AM

  1. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి మహోత్సవాలు

హాజరైన 2 లక్షలపై చిలుకు భక్తులు త్రివేణి సంగమం పులకించింది

కాళేశ్వరం, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి):ఓం నమఃశ్శివాయ& ఓం నమః శ్శివాయ& అంటూ శివనామస్మరణతో కాళేశ్వరం క్షేత్రం మార్మోగిపోయింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలు భక్తి, భవంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధాన ఘట్టమైన శ్రీ ముక్తీశ్వర శుభానంద కల్యాణ మహోత్సవం ఆదివారం సాయంత్రం ధనిష్ట నక్షత్ర యుక్త కర్కాటక లగ్నమందు శాస్త్రోక్తంగా నిర్వహించబడింది.

ఆలయ ప్రధాన అర్చకులు నగేశ్ శర్మ,పండితులు పవన్ శర్మ, శ్యామ్ శర్మ మంత్రోచ్చారణల మధ్య శివపార్వతుల దివ్య కల్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. బాజాభజంత్రీల నాదాలు, వేదఘోషల మధ్య జరిగిన ఈ కల్యాణ మహోత్సవం భక్తులకు కన్నుల పండువగా నిలిచింది. స్వామివారికి కట్నకానుకలు చదివించేందుకు భక్తులు పోటీపడ్డారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు వేడుకలకు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ ఆవరణం అంతా విద్యుద్దీపాలతో అలంకరించబడి దేవాలయ మహిమను మరింత పెంచింది. రాత్రి ఆలయ ప్రాంగణంలో హరికథా కాలక్షేపం, భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. చిన్నారుల నృత్యాలు, శివతాండవ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.రాత్రి యామాలలో మహాభిషేకం, లింగోద్భవ కాల పూజలు, చండీ హవనం తదితర ప్రత్యేక క్రతువులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్ధరాత్రి లింగోద్భవ దర్శనానికి భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ ప్రాంగణం అంతా హర హర మహాదేవ నినాదాలతో మార్మోగిపోయింది.మహా శివరాత్రి పురస్కరించుకొని శుక్రవారం నుంచే భక్తుల రాకపోకలు భారీగా పెరిగాయి. సుమారు రెండు లక్షల పైచిలుకు భక్తులు మూడు రాష్ట్రాల నుంచి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. త్రివేణి సంగమ ప్రాంతం భక్త జనసందోహంతో కళకళలాడింది. గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి,

మహిళలు సైకత లింగాలను పసుపు, కుంకుమలతో పూజించి శివుని అనుగ్రహం కోరారు.గోదావరి తీరం అంతా దీపాలతో, జపాలతో, శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా, సేవాదళాలు, పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పర్యవేక్షించారు.మొత్తానికి ఈసారి మహా శివరాత్రి వేడుకలు కాళేశ్వరం క్షేత్రానికి మరింత మహిమాన్వితత తీసుకొచ్చాయి. శివపార్వతుల దివ్య కల్యాణం భక్తుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది.