16-02-2026 12:11:08 AM
కాంగ్రెస్:8
బీఆర్‌ఎస్:8
అక్షర సత్యమైన ‘విజయక్రాంతి’ విశ్లేషించిన వార్త కథనం
కేసముద్రం, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీలో ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళి పై ఈనెల 13న ‘విజయక్రాంతి’ దినపత్రికలో ప్రచురించిన విశ్లేషణమైన వార్తా కథనం 13న ప్రకటించిన ఫలితాల్లో అక్షర సత్యం అయింది. పోలింగ్ కు ముందు ఓటర్లకు ‘భారీగా దండిగా కాసుల పంపిణీ!’ పంపిణీ చేశారని, దీనితో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని, ఓటర్లు గంపగుత్తగా ఎవరి వైపు మొగ్గుచూపు లేదని, తమకు డబ్బులు ఇచ్చిన అభ్యర్థులకు కుటుంబంలోని ఓట్లలో తలా కొన్ని వేశారని ప్రచారం సాగిన నేపథ్యాన్ని వివరించడం జరిగింది.
13న లెక్కించిన ఓట్లలో కేసముద్రం మున్సిపాలిటీలో విజయక్రాంతి ప్రచురించిన వార్త కథనం పూర్తిగా అక్షరసత్యం అయింది. కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా అధికార కాంగ్రెస్ కు 8, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కు 8 వార్డుల్లో సమాన విజయావకాశాలు దక్కాయి. దీనితో కేసముద్రం పట్టణ ఓటర్లు ఇరు పార్టీలకు సమన్యాయం చేశారు.
తొలిసారే ఉత్కంఠగా చైర్మన్ ఎన్నిక!
మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నిక తొలిసారే ఉత్కంఠ భరితంగా మారింది. కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, అమీనాపురం, ధనసరి, సబ్ స్టేషన్ తండా గ్రామాలను విలీనం చేసి 16 వార్డులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కృషితో కేసముద్రం మున్సిపాలిటీగా ఆవిర్భవించింది.
అనతి కాలంలోనే ఊహించని విధంగా కేసముద్రం మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో బుధవారం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని, అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారని అంతా భావించారు. అయితే శుక్రవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో అందుకు భిన్నంగా ఫలితాలు రావడంతో అంతా కంగుతిన్నారు.
16 వార్డుల్లో కనీసం 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని, ఎన్నికల పోలింగ్ సరళి కూడా అదేవిధంగా ఉందని అంతా భావించారు. అయితే శుక్రవారం ఓట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ కు చైర్ పర్సన్ పదవి దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ‘9’ కౌన్సిలర్ పదవులు దక్కకపోవడంతో ఎక్స్ అఫీషియో ఓటు ద్వారా కాంగ్రెస్ కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవిని దక్కించుకోవడానికి చర్యలు చేపట్టింది. ఇక్కడ మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎక్స్ అఫీషియో ఓటు హక్కును వినియోగించడానికి దరఖాస్తు చేసుకున్నారు.
నేడు చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక
కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
నూతనంగా ఎన్నికైన వార్డ్ కౌన్సిలర్ల చేత పదవి ప్రమాణం చేయించిన తర్వాత చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం గెలుపొందిన వార్డు కౌన్సిలర్లకు ఇప్పటికే సమావేశానికి హాజరుకావాలని నోటీసు ఇచ్చినట్లు చెప్పారు.