5 May, 2026 | 4:18 AM

అసోంలో హిమంత ప్రభంజనం

05-05-2026 01:37 AM
  1. శర్మ వ్యూహాలతో బీజేపీకి విజయం 
  2. బంగ్లాదేశ్ చొరబాటుదారులపై ఉక్కుపాదం
  3. మౌలిక సదుపాయాల కల్పనలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ముఖ్యమంత్రి 
  4. డబుల్ ఇంజిన్ సర్కారుపై ప్రజల్లో పెరిగిన నమ్మకం 

దిస్పూర్, మే 4: అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘనవిజయం సాధించేందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక పాత్ర పోషించారు. తన రాజకీయ చతురతతో, వ్యూహాత్మక ప్రణాళికలతో పార్టీని గెలుపు తీరాలకు చేర్చారు. హిమంత బిశ్వశర్మ ప్రభుత్వం అసోంలో మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, నివాసం వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఆదివాసీ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ఆయన తీసుకున్న చర్యలు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చాయి.

దీనితో అక్కడి ప్రజలు ఆయనను ఆత్మీయంగా ‘మాము’ (తల్లి సోదరుడు) అని పిలుచుకుంటున్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో శర్మ విజయం సాధించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన కఠినంగా వ్యవహరించారు. ఎన్‌ఆర్సీ అమలు, స్థానికుల భూముల రక్షణపై ఆయన ఇచ్చిన హామీలు ఓటర్లను ఆకట్టుకున్నాయి.

అయోధ్య రామమందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలను బలంగా ప్రచారం చేస్తూ, సరిహద్దు దేశాల నుంచి ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ జాతీయవాదిగా గుర్తింపు పొందారు. గత 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోని అవినీతిని, అభివృద్ధి లేమిని ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతూ ఆ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మకు ఉన్న ప్రజాదరణ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మా తోడవడంతో అసోంలో బీజేపీ మరోసారి తిరుగులేని శక్తిగా అవతరించింది. 2015లో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన హిమంత బిశ్వశర్మకు కాంగ్రెస్ పార్టీలో లోపాలు, అసోం రాజకీయాలపై లోతైన పరిజ్ఞానం ఉంది.

అసోం గణపరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ వంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని, కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేయడంలో సఫలమయ్యారు. ఆదివాసీలు, టీ తోటల కార్మికులు, పట్టణ ఓటర్లను ఒకే తాటిపైకి తీసుకురావడంలో శర్మ అనుసరించిన వ్యూహాలు ఫలించాయి. కాగా కేంద్రం సహకారంతో ఆయన అసోంలో టాటా సెమీకండక్టర్ కర్మాగారం ఏర్పాటు, బ్రహ్మపుత్ర నదిపై కుమార భాస్కర్ వర్మ సేతువంతెన నిర్మాణం, నది కింద టన్నెల్ పనులు, కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ వంటి భారీ ప్రాజెక్టులను హిమంత వేగవంతం చేశారు.