కాళేశ్వర క్షేత్రంలో పుష్కర వైభవం
నేటి నుంచి సరస్వతి అంత్యపుష్కరాలు
- ప్రారంభించనున్న కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ
- సాయంత్రం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పుష్కర స్నానం
- దివ్య ఆధ్యాత్మిక మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
- హాజరుకానున్న ప్రముఖ పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు, వేదవేత్తలు
- జూన్ 1 వరకు పుష్కరాల నిర్వహణ
కాళేశ్వరం (మహబూబాబాద్), మే 20 (విజయక్రాంతి): గోదావరి, ప్రాణహిత అంతర్వాహిని సరస్వతి నది సంగమక్షేత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దివ్య ఆధ్యాత్మిక మహోత్సవాలకు వేదిక కానుంది. గురువారం సరస్వతి అంత్య పుష్కర వేడుకలు ఘనంగా ప్రారంభంకానున్నాయి. జూన్ 1 వరకు వేడుకలు జరగనున్నాయి. గురువారం తెల్లవారు జామున 5.43 గంటలకు కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ పుష్కర స్నానం ఆచరించి పుష్కరాలను ప్రారంభిస్తారు.
సాయంత్రం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పుష్కర స్నానం ఆచరించనున్నారు. 21 వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ప్రతీ రోజూ ఒక ప్రముఖ పీఠం స్వామిజీ ఈ పుష్కారాల్లో పాల్గొని పుణ్య స్నానం చేస్తారు. ప్రతీరోజూ ఉదయం హోమాలు నిర్వహణ, సాయంత్రం పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అంత్యపుష్కర మహోత్సవాలకు కాళేశ్వరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గోదావరి, ప్రాణహిత సరస్వతీ నది అంతర్వాహినిగా భావించే ఈ పుణ్యక్షేత్రంలో బ్రహ్మముహూర్తంలో పుష్కర స్నానాలతో మహోత్సవాలకు ఘన శ్రీకారం చుట్టనున్నారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, హోమధూమాలతో కాళేశ్వరం క్షేత్రం దివ్య ఆధ్యాత్మిక ప్రకాశంతో వెలిగిపోనుంది.
ఉదయం పుణ్యకాల ప్రారంభ వేళ వేదపండితుల ఆశీర్వచనాల మధ్య గోదావరి ఘాట్ వద్ద పుష్కర హారతితో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి పితృతర్పణాలు, పిండప్రదానాలు నిర్వహించనున్నారు. ‘పుష్కర స్నానం పాపక్షయానికి, పితృదేవతల అనుగ్రహానికి మహోన్నతమైన ఆధ్యాత్మిక సాధన’గా భావిస్తూ లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కార్యక్రమాల్లో భాగంగా గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమం, రుద్రహోమం, చండీయాగం, గోపూజ, వేదపారాయణాలు, మహామంగళహారతులు నిర్వహించనున్నారు. ప్రముఖ పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు, వేదవేత్తలు పాల్గొని భక్తులకు ఆశీర్వచనాలు అందించనున్నారు. పుష్కర ఘాట్ల వద్ద భజన మండళ్లు, హరికథలు, ఆధ్యాత్మిక సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సాయంత్రం నిర్వహించే గోదావరి మహాహారతి పుష్కర వేడుకలకు తారాస్థాయి ఆధ్యాత్మిక వైభవాన్ని చేకూర్చనుంది. దీపకాంతులతో మెరిసే నదీ తీరాలు, హారతి జ్వాలల వెలుగులు, వేదఘోషల మధ్య భక్తులు ఆధ్యాత్మిక పరవశ్యంలో మునిగిపోయేలా ఏర్పాట్లు చేశారు.
సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గేయాలు, నృత్య రూపకాలు భక్తులను అలరించనున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర నలుమూలల నుండి 3,360 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ కాళేశ్వరానికి నడుపుతున్నది. ప్రత్యేక స్నాన ఘాట్లు, తాగునీటి వసతి, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య చర్యలు, మొబైల్ టాయిలెట్లు, వెయ్యి మందితో పోలీస్ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. కాళేశ్వర క్షేత్రం భక్తి తరంగాలతో కళకళలాడుతుండగా, సరస్వతి అంత్యపుష్కరాలు భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతి వైభవానికి ప్రతీకగా నిలవనున్నాయి.
ఘనంగా ఏర్పాట్లు
సరస్వతి అంత్య పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజ రామయ్యార్ తెలిపారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవిందహరి లతో కలిసి సరస్వతి ఘాట్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్న గోదావరి సంగమం ప్రాంతాలను పరిశీలించారు. స్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని పుణ్యఫలాన్ని పొందాలని ఆమె భక్తులకు పిలుపునిచ్చారు.
పుష్కరాలు ప్రశాంతంగా జరగాలి : సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్ర ప్రజలందరికి సీఎం రేవంత్‌రెడ్డి పుష్కర శుభాకాంక్షలు తెలిపారు. ‘సరస్వతీ అంత్య పుష్కరాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకోవాలి. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చూడాలి. భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేయాలి. ఎండలు ఎక్కువ ఉన్నందున భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలి. పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరగాలి’ అని అన్నారు.
పుష్కరాల్లో ప్రధాన ఆకర్షణ తెప్పోత్సవం
సరస్వతి అంత్య పుష్కరాలను పురస్కరించుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి శివానంద దేవి ఉత్సవ విగ్రహాలకు 12 రోజులపాటు ప్రతిరోజు సాయంత్రం గోదావరి నదిలో వైభవంగా తెప్పోత్సవం నిర్వహించనున్నారు. హంస ఆకృతిలో అత్యంత సుందరంగా రూపొందించిన పడవలో దేవత మూర్తులతో తెప్పోత్సవం నిర్వహించనున్నారు.






