21 May, 2026 | 4:32 AM

ప్రమాదాలకు నిలయాలుగా చౌరస్తాలు

21-05-2026 12:06 AM

సిగ్నల్స్ను పట్టించుకోని వాహనదారులు

కల్వకుర్తి మే 20 : మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న వాహనాల కారణంగా పట్టణంలోని చౌరస్తాలు ప్రమాదాలకు నిలయా లుగా మారుతున్నాయి. నివారణకు అధికారులు చేపడుతున్న చర్యలు నామమాత్రం గానే ఉండటంతో ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కల్వకుర్తి పట్టణంలో వాహనాల రద్దీ గణనీయంగా పెరిగినప్పటికీ, అందుకు అనుగుణంగా చౌరస్తాల విస్తరణ జరగకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. ముఖ్యంగా జడ్చర్లకోదాడ జాతీయ రహదారి పట్టణం మీదుగా వెళ్లడం వల్ల భారీ వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. దీంతో ట్రాఫిక్ నియంత్రణ పెద్ద సవాలుగా మారింది.పట్టణంలోని పాలమూరు చౌరస్తా, నాగర్కర్నూల్ చౌరస్తా వంటి ప్రధాన కూడళ్ల వద్ద తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

సిగ్నల్స్ ఏర్పాటు చేసినప్పటికీ అవి పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం, పోలీసులు నిరంతరం విధుల్లో లేకపోవడం పరిస్థితిని దారుణంగా మారుస్తోంది. కొందరు వాహనదారులు సిగ్నల్ వద్ద నిర్లక్ష్యంగా వాహనాలు నిలుపుతుండగా, మరికొందరు రెడ్ సిగ్నల్ను లెక్కచే యకుండా ముందుకు దూసుకెళ్తున్నారు.రెడ్ సిగ్నల్ పడకముందే దాటేయాలనే ఉద్దేశంతో దూరం నుంచే వేగంగా వచ్చి ఒక్క సారిగా బ్రేకులు వేయడం వల్ల వాహనాలు ఒకదానికొకటి ఢీకొంటున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. గత వారం రోజులుగా పాలమూరు, నాగర్కర్నూల్ చౌరస్తాల్లో పలువురు ప్రమాదాలకు గురైన సంఘటనలు నమోదయ్యాయి.

జరిమానాలు లేకపోవడం వల్లే

సిగ్నల్ జంప్ చేసినా జరిమానాలు లేకపోవడంతో చాలామంది నిబంధనలను పట్టించుకోవడం లేదు. దీంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించాలని ప్రజలు కోరుతున్నారు. చౌరస్తాలకు కొంత దూరం నుంచే వేగ నియంత్రణ చర్యలు చేపడితే ప్రమాదాలను కొంతవరకు తగ్గించవచ్చని పలువురు వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.

జాతీయ రహదారి నిర్మాణ సమయంలోనే చౌరస్తాల్లో సర్కిళ్లు, సరైన మలుపులు, ట్రాఫిక్ నియంత్రణ సదుపాయాలు ఏర్పాటు చేస్తారని ప్రజలు భా వించినప్పటికీ, అవి అమలుకాకపోవడంతో ప్రస్తుతం భారీ వాహనాలు మలుపులు తిరగడానికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నామమాత్రంగా రహదారి నిర్మాణం పూర్తి చేయడంతో సమస్య మరింత జటిలమైంది. అధికారులు స్పందించి ప్రధాన చౌరస్తాల్లో కెమెరాలు ఏర్పాటు చేయడం, వేగ నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని ప్రజలు అంటున్నారు.